నిద్ర మ‌త్తులో టూత్ బ్ర‌ష్ ని మింగేసిన వ్య‌క్తి..ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది..

మ‌నం రోజు చేసే బ్ర‌ష్ ఏమంత చిన్న‌దిగా ఉండ‌దు. మ‌రి అలాంటి బ్ర‌ష్ ని మింగేస్తే..ప‌రిస్థితి ఏంటీ. నిద్ర మత్తులో ఉన్న ఓ వ్యక్తి.. అనుకోకుండా టూత్‌ బ్రష్‌ని మింగేశాడు. దాంతో అతను తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నాడు. గొంతులోకి వెళ్లిన ఆ టూత్‌బ్రష్‌ని బయటకు తీయడానికి వైద్యులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చివరికి శస్త్రచికిత్స చేసి ఆ బ్రష్‌ను బయటకు తీశారు. చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లోని తైజౌకు చెందిన ఈ వ్యక్తి ఎప్పటిలాగే.. ఉదయం నిద్రలేచి పళ్లు తోముకుంటున్నాడు. అయితే, అప్పటికీ నిద్రమత్తులో ఉన్న అతను.. టూత్‌బ్రష్‌ని పొరపాటున మింగేశాడు. మింగిన బ్రష్ 15 సెంటీమీటర్ల పొడవు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, గొంతులోకి వెళ్లిన టూత్‌బ్రష్‌ను బయటకు తీసేందుకు అతను ప్రయత్నించగా.. అదికాస్తా మరింత లోపలికి వెళ్లిపోయింది. అయితే, ఈ పరిస్థితికి అతను ఏమాత్రం కంగారు పడకుండా గుండె ధైర్యంతో.. నేరుగా ఆస్పత్రికి వెళ్లాడు. వైద్యులు అతనికి ఎక్స్‌-రే తీసి.. అత్యవసర గ్యాస్ట్రోస్కోపిక్ శస్త్రచికిత్స అవసరమని చెప్పారు. ఆపరేషన్ సమయంలో బ్రష్‌ను బయటకు తీసేందుకు వైద్యులు చాలా ఇబ్బందులు పడ్డారు. చాలా సాఫ్ట్‌గా ఉన్న ఆ బ్రష్ హ్యాండిల్‌ను పట్టుకునేందుకు తంటాలు పడ్డారు. చాలా సేపు ప్రయత్నించిన తరువాత.. మొత్తానికి ఆ బ్రష్‌ను బయటకు తీశారు. దాంతో అతను సేఫ్ అయ్యాడు. ఈ ఘనటపై ఆస్పత్రి గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాధిపతి వాంగ్ జియాన్రాంగ్ స్పందించారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. కీలక విషయాలను వెల్లడించారు. సాధారణంగా ఎవరైనా ఏదైనా వస్తువును మింగినప్పుడు గొంతులో అడ్డం పడకుండా ఉండేందుకు అన్నం ముద్దలు గానీ, మరేదైనా మింగడం చేస్తుంటారు. కానీ, ఇతను మాత్రం అలా చేయకుండా మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ఆస్పత్రికి రావడం ప్రశంసనీయం అని జియాన్రాంగ్ పేర్కొన్నారు. అందరిలాగే అతనూ చేసి ఉంటే.. అతని అన్నవాహిక తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉండేదని చెప్పారు. అందుకే.. గొంతులో ఏదైనా తట్టినా.. ప్రమాదకరమైన వస్తువు మింగినా వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *