నేటి చరిత్ర.. చౌరీ చౌరా ఘటనకు వందేండ్లు
దేశ స్వాతంత్య్రం కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఎంతే మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒకటి.. ఒకప్పటి ఉత్తరప్రదేశ్ లోని ఘోరఖ్‌పూర్ జిల్లాలోని చౌరీ చౌరా ప్రాంతంలో జరిగిన ఘటనకు గురువారం (ఫిబ్రవరి 4)తో సరిగ్గా వందేండ్లు నిండాయి. 1922 లో చౌరీ చౌరాలో స్వాతంత్య్రోద్రమకారుల ఆగ్రహానికి గురై 22 మంది పోలీసులు, ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో దాదాపు 172 మందిపై నేరారోపణలు మోపిన బ్రిటిష్ ప్రభుత్వం వారిని ఉరితీసింది. ఈ రోజును బలిదానదినంగా కూడా పరిగణిస్తున్నారు. ఇలాంటి ఘటన ఇదే మొదటిది. చౌరీ చౌరా ఘటన జరిగి 100 ఏండ్లు పూర్తయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో ప్రధాని మోదీ ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా చౌరీ చౌరాను గుర్తుకుతెచ్చే పోస్టల్ స్టాంపును కూడా మోదీ విడుదల చేశారు. ఈ ఉత్సవాలను రెండు రోజులపాటు జరుపనున్నారు.
విదేశీ వస్త్రాలు బహిష్కరించాలని, ఇంగ్లిష్ చదువు మానేసి చర్ఖా నడుపుకోవాలని మహాత్మాగాంధీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆ సమయంలో సహకారేతర ఉద్యమం దేశవ్యాప్తంగా గరిష్ట స్థాయిలో ఉంది. గాంధీజీ పిలుపుమేరకు సత్యగ్రహం చేపట్టేందుకు చౌరీ చౌరాలోని భోపా మార్కెట్ వద్ద పలువురు సమావేశమయ్యారు. వారు శాంతి పాదయాత్ర చేస్తుండగా.. ఈ మార్చ్ చట్టవిరుద్ధమని పోలీసులు ప్రకటించి కాల్పులు జరిపారు. ఈ దశలో అక్కడే ఉన్న పోలీస్ స్టేషన్‌కు ఉద్యమకారులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో పోలీస్ స్టేషన్ సహా 22 మంది పోలీసులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనను రికార్డుగా తీసుకొని మహాత్మా గాంధీ సహకారేతర ఉద్యమాన్ని ఉపసంహరించుకున్నారు. 1923 జనవరి 9 న ఘోరఖ్‌పూర్ కోర్టు 418 పేజీల తీర్పు ఇచ్చింది. ఇందులో 172 మంది దోషులుగా నిర్ధారించి మరణశిక్ష విధించారు. మరో ఇద్దరికి జైలుశిక్ష విధించింది. 47 మందిని నిర్దోషులుగా ప్రకటించింది.
ప్రజాకవి మఖ్దూం జననం
బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి, నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన ప్రజా కవి మఖ్దూం మొహియుద్దీన్ 1908లో సరిగ్గా ఇదే రోజున మెదక్ జిల్లా అందోల్ గ్రామంలో జన్మించారు. రాజకీయ, సాహిత్య రంగాల్లో తనదైన ముద్రవేసుకున్న మఖ్దూం.. పార్సీ, అరబిక్, ఉర్దూ భాషల్లో ప్రావిణ్యం సంపాదించారు. 1937 లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పూర్తిచేసిన తర్వాత సిటీ కాలేజీలో అధ్యాపకుడిగా చేరారు. చిన్ననాటి నుంచే స్వేచ్ఛా, స్వతంత్ర భావాలు ఉన్న మఖ్దూం.. 1934 లో టూర్ అనుభవ గీతం ద్వారా తనలోని కవితా తృష్ణకు అక్షర రూపం కల్పించారు. మఖ్దూం రాసిన విదురుల గృహాలు నాటకం చూసిన రవీంద్రనాథ్ ఠాగోర్ తన శాంతినికేతన్‌కు రావాలని ఆహ్వానించారు. 1941 లో కమ్యూనిస్టు పార్టీ నగర శాఖను ఏర్పాటుచేయడంతో అధ్యాపక వృత్తికి రాజీనామా చేసి.. కమ్యూనిస్టు ఉద్యమానికి అంకితమయ్యారు. ఆయన రాసిన పలు గజళ్లు తెలుగులోకి అనువాదమయ్యాయి. చివరకు 1969 ఆగస్టు 25 న మఖ్దూం కన్నుమూశారు.
ఫేస్‌బుక్‌కు నేటితో 17 ఏండ్లు
సోషల్ మీడియా సైట్ ఫేస్‌బుక్ 2004లో సరిగ్గా ఇదే రోజున ప్రారంభమైంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన నలుగురు విద్యార్థులు మార్క్ జుకర్‌బర్గ్, ఎడ్వర్డో సెవెరిన్, డస్టిన్ మోస్కోవిట్జ్, క్రిస్ హ్యూస్.. దీనిని ప్రారంభించారు. దీనిని హార్వర్డ్ విశ్వవిద్యాలయ విద్యార్థుల కోసం రూపొందించారు. అనంతరం ఇది అమెరికాలోని పలు కాలేజీలకు విస్తరించింది. 2012 నాటి లెక్కల ప్రకారం 1 బిలియన్ వినియోగదారులతో ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌గా అవతరించింది. సంస్థ ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్ లో ఉన్నది.
మైక్రోసాఫ్ట్ సంస్థ 2007 లో ఫేస్‌బుక్‌లో 1.6 శాతం వాటాను రూ.1,704 కోట్లకు కొనుగోలు చేసింది. దీని తరువాత ఫేస్‌బుక్ మార్కెట్ విలువ రూ.10.65 లక్షల కోట్లకు పెరిగింది. 2012 ఏప్రిల్ నెలలో ఇన్‌స్టాగ్రామ్‌ను రూ.7,100 కోట్లకు కొనుగోలు చేసింది. 2014 లో ఓకులస్ సంస్థను రూ.14,000 కోట్లకు సొంతం చేసుకుంది. ఆ తర్వాత రూ.1.34 లక్షల కోట్లకు వాట్సాప్‌ను కొనుగోలు చేసింది. ఫేస్‌బుక్ ప్రస్తుతం 760 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ కలిగి ఉంది.
ఫిబ్రవరి 4న జరిగిన మరిన్ని ముఖ్య ఘటనలు
1628 : ఆగ్రా చక్రవర్తిగా ప్రకటించి సింహాసనం అధిష్టించిన షాజహాన్
1881: లోకమాన్య తిలక్ సంపాదకత్వంలో వార్తాపత్రిక కేసరి మొదటి సంచిక ప్రచురణ
1922: భారతరత్న, శాస్త్రీయ సంగీతకారుడు పండిట్ భీమ్‌సేన్ జోషి జననం
1938 : కథక్ న్యాట గురువు బిర్జూ మహారాజ్ జననం
1948 : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌పై తొలిసారి నిషేధం ప్రకటన
1960: భోపాల్ రాచరిక చివరి నవాబు అయిన హమీదుల్లా ఖాన్ మరణం
1978: శ్రీలంక మొదటి అధ్యక్షుడిగా నియమితులైన జూలియస్ జయవర్ధనే
1974: భారతదేశపు గణిత శాస్త్రజ్ఞుడు సత్యేంద్రనాథ్ బోస్ మరణం
2000: జాతీయ క్యాన్సర్ అవగాహనా దినం ప్రారంభం
2014: మైక్రోసాఫ్ట్ నూతన సీఈవోగా సత్య నాదెల్లా నియామకం