నేటి చరిత్ర.. బల్బుకు పేటెంట్ దక్కిన రోజు
అమెరికన్ శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసన్ కనుగొన్న విద్యుత్ బల్బుకు 1880 లో సరిగ్గా ఇదే రోజున (జనవరి 27) పేటెంట్ దక్కింది. ఎడిసన్ 1847 ఫిబ్రవరి 11న అమెరికాలోని మిలన్‌లో జన్మించారు. చిన్నప్పడే మిచిగాన్‌కు తరలివెళ్లిన ఎడిసన్.. అక్కడే తన తల్లి ద్వారా గణితం సహా పలు సబ్జెక్టులు చదివారు. అతి తక్కువ కాలం స్కూలుకు వెళ్లిన ఎడిసన్.. స్వయంశక్తితో చదువుకుని పలు విషయాంశాల్లో నిష్ణాతుడయ్యారు. జీవితం గడిచేందుకు పోర్ట్ హ్యురాన్ నుంచి డెట్రాయిట్ వెళ్లే రైలులో క్యాండీళ్లు, దినపత్రికలు, కూరగాయలు అమ్మి ఆ రోజుల్లోనే రోజుకు 50 డాలర్ల వరకు లాభం సంపాదించేవారు. చదువులో బలహీనంగా ఉన్న ఎడిసన్ తన 10 ఏళ్ల వయసులో ఇంటి వద్దే ప్రయోగశాలను ఏర్పాటు చేశాడంటే ఆయనకు పరిశోధనల పట్ల ఎంతగా ఆసక్తి ఉందో తెలుస్తున్నది. తల్లి ఇచ్చిన కెమిస్ట్రీ పుస్తకంలోని పలు రసాయన సూత్రాలు ఎడిసన్‌ను ఎంతగానో ఆకర్శించాయి. 1876లో న్యూజెర్సీలో తన సొంత ల్యాబ్‌ను ఏర్పాటు చేసిన ఎడిసన్.. అక్కడ ఎలక్ట్రిక్ విద్యుత్ ఉత్పత్తి, మాస్ కమ్యూనికేషన్, సౌండ్ రికార్డింగ్, మోషన్ పిక్చర్స్ వంటి రంగాలలో అనేక పరికరాలను అభివృద్ధి చేశారు. 1878 లో విద్యుత్ బల్బును కనిపెట్టే పనిని చేపట్టి దాదాపు 10 వేల సార్లు విఫలమయ్యారు. అనంతరం బల్బు తయారీని విజయవంతంగా పూర్తిచేసి 141 ఏళ్ల క్రితం జనవరి 27న దీనికి పేటెంట్ పొందారు. బల్బు తయారీకి దాదాపు 40 వేల డాలర్లు ఖర్చు చేసినట్లు పరిశోధకులు చెప్తారు. తన జీవితంలో మొత్తం 1,093 పేటెంట్ల ఆవిష్కరణలను జరిపిన ఎడిసన్.. 1931 అక్టోబర్ 18న కన్నుమూశారు.
ఎడిసన్ ముఖ్యమైన ఆవిష్కరణలు
థామస్ అల్వా ఎడిసన్ వెయ్యికిపైగా ఆవిష్కరణలు చేశారు. ఆయన చేసిన పలు రచనలు చరిత్రలో నిలిచిపోయాయి. ఎలక్ట్రిక్ బల్బులతోపాటు వాయిస్ రికార్డ్ చేయడానికి, ప్లేబ్యాక్ చేయడానికి ఫోనోగ్రాఫ్ పరికరాలను కూడా కనుగొన్నారు. బల్బు సేఫ్టీ ఫ్యూజ్, ఆన్/ఆఫ్ స్విచ్ కూడా చేసింది ఈయనే. మోషన్ పిక్చర్‌ను కనుగొన్న ఘనత కూడా ఎడిసన్‌దే.
జనవరి 27 మరికొన్ని ముఖ్య ఘట్టాలు
1891: పెన్సిల్వేనియాలోని మౌంట్ ప్లెసెంట్‌లో గని పేలుడు, 109 మంది మరణం
1943: మొదట జర్మనీపై వైమానిక దాడి చేసిన అమెరికా
1959: న్యూఢిల్లీలో తొలి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీకి పునాదిరాయి
1967: అంతరిక్షంలో యుద్ధానికి డీలిమిటేషన్ ఒప్పందంపై ఐక్యరాజ్యసమితిలో సంతకాలు చేసిన 60 దేశాలు
1969: ఇరాక్‌లోని బాగ్దాద్‌లో 14 మందికి గూఢచర్యం కింద మరణశిక్ష విధింపు
1984 : కల్పాకంలో అణు విద్యుత్ తొలి ఉత్పత్తి కేంద్రం ప్రారంభం
1996: ఆరో, చివరి అణు పరీక్ష చేపట్టిన ఫ్రాన్స్
2007: హిందీ రచయిత కమలేశ్వర్ మరణం
2013: ఆఫ్ఘనిస్థాన్‌లోని కాందహార్‌లో బాంబు దాడులు, 20 మంది పోలీసులు మరణం