పురావస్తు తవ్వకాల్లో వెయ్యి ఏళ్ల నాటి కోడిగుడ్డు..

కోడిగుడ్లు మహా ఉంటే మన ఇంట్లో ఎన్ని రోజులు ఉంటాయి..నెల..రెండు నెలలు.కానీ ఇక్కడ ఏకంగా వెయ్యి సంవత్సరాల క్రితం కోడి గుడ్డు దొరికిందట. ఎక్కడో తెలుసా ఇజ్రాయెల్‌లో ఇటీవ‌ల జ‌రిపిన‌ తవ్వకాల్లో 1000 సంవత్సరాల నాటి కోడిగుడ్డు దొరికింది. ఆశ్చర్యకరంగా ఈ గుడ్డు ఇన్నేండ్ల‌యినా సురక్షితంగా ఉన్న‌ది. దానికి బ‌య‌ట‌కు తీసి శుభ్రపరుస్తుండ‌గా పగుళ్లు వచ్చాయి. ఇది ప్రపంచంలోని పురాతన గుడ్లలో ఒకటి అని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ అద్భుతమైన ఆవిష్కరణ గురించి ఇజ్రాయెల్ పురావస్తు విభాగం ఫేస్‌బుక్‌లో ఒక వివరణాత్మక పోస్ట్‌ను షేర్ చేశారు.మధ్య ఇజ్రాయెల్‌లోని యావ్నేలో పట్టణ అభివృద్ధి ప్రాజెక్టు పనుల తవ్వకాల‌ సమయంలో ఈ పురాత‌న కోడిగుడ్డు దొరికింది. ఈ గుడ్డు 10 వ శతాబ్దానికి చెందినదని భావిస్తున్నారు. యావ్నేలో పురావస్తు త్రవ్వకాల్లో దాదాపు 1000 సంవత్సరాల క్రితం నాటి కోడిగుడ్డు కనుగొన్నాం అని ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇలాంటి అతిపురాత కోడిగుడ్డు దొర‌క‌డం చాలా అరుదు అని ఇజ్రాయేల్ పుర‌వాస్తు విభాగానికి చెందిన నిపుణురాలు డాక్ట‌ర్ లీ పెర్రీ గాల్ చెప్పారు. త‌వ్వ‌కాలు జ‌రుపుతుండ‌గా వివిధ జంతువుల గుడ్ల పెంకులు బ‌య‌ట‌ప‌డ‌టం జ‌రుగుతుంద‌ని, అయితే ఇంత పురాత‌న గుడ్డు మొత్తం దొర‌క‌డం ప్ర‌పంచంలోనే ఇది తొలిసార‌ని ఆమె పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *