శునకాలకు..పిల్లులకు పాస్ పోర్టులు..ఉన్నాయని తెలుసా..

పాస్ పోర్టు మనుషులకే కాదు పెంపుడు జంతువులకి వున్నాయన్న విషయం మీకు తెలుసా..అవునండీ ఇది అక్షరాలా నిజం..మరి ఆ వివరాలు తెలుసుకుందామా. ఒక దేశం నుంచి మ‌రో దేశం వెళ్లాలంటే పాస్‌పోర్టు త‌ప్ప‌నిస‌రి. ఈ పాస్‌పోర్టులు మ‌నుషుల‌కే కాదు.. జంతువుల‌కు కూడా ఉన్నాయ‌ని తెలుసా .. ఆశ్చ‌ర్య‌పోతున్నారా.. నిజంగా పెంపుడు శున‌కాల‌కు, పిల్లుల‌కు పాస్‌పోర్టులు ఉన్నాయి. పెట్ పాస్‌పోర్టు ఉంటేనే మ‌న పెంపుడు శున‌కాల‌ను ఒక దేశం నుంచి ఇంకో దేశానికి తీసుకెళ్ల‌గ‌లం. మ‌రి ఈ పెట్ పాస్‌పోర్ట్ ఇవ్వ‌డం ఎప్పుడు మొద‌లైంది. పెట్ పాస్‌పోర్టు ఎవ‌రు ఇస్తారు.. అందులో ఏ వివ‌రాలు ఉంటాయ‌నే విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం..యూరోపియ‌న్ దేశాల నుంచి బ్రిట‌న్‌కు కుక్క‌, పిల్లి లేదా ఇత‌ర ఏ జంతువునైనా తీసుకెళ్లాలంటే క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌ల్లో ఉండేవి. ముఖ్యంగా రేబిస్ వ్యాధి వ్యాప్తి చెంద‌కుండా ఉండేందుకు పెంపుడు జంతువును క‌నీసం ఆరు నెల‌ల పాటు క్వారంటైన్‌లో ఉంచేవారు. ఇత‌ర దేశాల నుంచి దిగుమ‌తి చేసుకునే జంతువుల‌కు కూడా ఇలాంటి నిబంధ‌న‌లే ఉండేవి. దీంతో ఆయా పెంపుడు జంతువుల య‌జ‌మానులు ఇబ్బందుల‌కు గుర‌య్యేవారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని యూరోపియ‌న్ యూనియ‌న్ తొలిసారిగా ఈ పెట్ పాస్‌పోర్టును 2001 అక్టోబ‌ర్ 1న ప్ర‌వేశ‌పెట్టింది. ఈయూ త‌ర్వాత అమెరికా, కెన‌డా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, జ‌పాన్ వంటి దేశాలు కూడా ఈ పెట్ పాస్‌పోర్టును తీసుకొచ్చాయి. వీటిని ప్ర‌భుత్వ గుర్తింపు పొందిన ప‌శువైద్యులు జారీ చేస్తారు.భార‌త్‌లో కూడా పెంపుడు జంతువుల‌కు పెట్ పాస్‌పోర్టు పొంద‌వ‌చ్చు. కాక‌పోతే ఇది అధికారికంగా ఇచ్చేదేమీ కాదు. అయితే ఇత‌ర దేశాల నుంచి భార‌త్‌కు లేదా.. భార‌త్ నుంచి ఇత‌ర దేశాల‌కు మ‌న పెట్‌ను తీసుకెళ్లాలంటే ఏ డాక్యుమెంట్లు అవ‌స‌రం అవుతాయో వాటి వివ‌రాల‌న్నీ ఈ పెట్ పాస్‌పోర్టులో ఉంటాయి. ముఖ్యంగా మీ పెట్ ప్ర‌యాణానికి స‌రిప‌డా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉందా? లేదా? అన్న వివ‌రాలు అలాగే ప్ర‌యాణానికి సంబంధించి ఏనిమ‌ల్ స్టేష‌న్ నుంచి ఇచ్చే నో అబ్జెక్ష‌న్ స‌ర్టిఫికెట్ వివ‌రాలు ఇందులో పొందుప‌ర‌చి ఉంటాయి. ఈ పెట్ పాస్‌పోర్టు ఉండ‌టం వ‌ల్ల ఇత‌ర దేశాల‌కు వెళ్లిన‌ప్పుడు.. మీ పెట్‌ను క్వారంటైన్‌లో ఉంచాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.మీ పెంపుడు జంతువుతో బ‌య‌ట దేశాల‌కు వెళ్లాల‌నుకుంటే ఈ మైక్రోచిప్ చాలా అవ‌స‌రం. పెంపుడు జంతువును అనుమ‌తించాలంటే చాలా దేశాలు ఈ మైక్రోచిప్‌ను అడుగుతున్నాయి. మైక్రోచిప్ అంటే ఒక ఎల‌క్ట్రానిక్ ధ్రువీక‌ర‌ణ‌. ఈ చిప్ బియ్య‌పు గింజ ప‌రిమాణంలో ఉంటుంది. దీన్ని పెట్ భుజాల మ‌ధ్య శ‌రీరంలోకి ప్ర‌వేశ‌పెడ‌తారు. ప్ర‌తి చిప్‌కు ఒక యునిక్ నంబ‌ర్ ఉంటుంది.మూడు నెల‌ల వ‌య‌సు దాటిన శున‌కాలు, పిల్లుల‌కు రేబిస్ వ్యాక్సినేష‌న్ త‌ప్ప‌నిస‌రిగా చేయించాలి. అప్పుడే ఏ దేశ‌మైనా స‌రే పెంపుడు జంతువును త‌మ దేశంలోకి అనుమ‌తిస్తాయి. ఒక‌వేళ మీ పెంపుడు జంతువు శున‌కం లేదా పిల్లి కాక‌పోతే రేబిస్ వ్యాక్సినేష‌న్ అక్క‌ర్లేదు. కాక‌పోతే హెల్త్ స‌ర్టిఫికెట్ క‌చ్చితంగా ఉండాలి. ఇక శున‌కాలు, పిల్లులను విదేశాల నుంచి భార‌త్‌లోకి తీసుకురావాలంటే క‌నీసం 30 రోజుల ముందు రేబిస్ వ్యాక్సిన్ ఇప్పించి ఉండాలి. అలాగే రేబిస్ టీకా ఇచ్చి సంవ‌త్స‌రం దాటి ఉండొద్దు.ఒక‌వేళ ఇత‌ర దేశాల నుంచి శున‌కాల‌ను దిగుమ‌తి చేసుకునేందుకు పెట్ పాస్‌పోర్టు పొందాలంటే డిస్టెంప‌ర్‌, లిష్మానియ‌సిస్‌, ప‌ర్వోవైర‌స్‌, లిప్టోస్పిరోసిస్ టీకాలు వేయించాలి. అది కూడా క‌నీసం 30 రోజుల ముందు వ్యాక్సిన్ వేయించి ఉండాలి. అదే వేరే దేశానికి మీ పెట్‌ను తీసుకెళ్లాల‌ని అనుకుంటే ఆ దేశం ఏ వ్యాక్సిన్లు వేయించాల‌ని చెబుతుందో వాటిని వేయించాలి.ఇత‌ర దేశాల నుంచి ఒక పెట్‌ను దిగుమ‌తి చేసుకోవాల‌ని అనుకుంటే క‌చ్చితంగా భార‌త్‌లోని ఏనిమ‌ల్ క్వారంటైన్ స్టేష‌న్ నుంచి నో అబ్జెక్ష‌న్ స‌ర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం పెట్ య‌జ‌మాని లేదా య‌జ‌మానికి సంబంధించిన వారు ఎవ‌రైనా స‌రే ఆఫీసుకి వెళ్లి ఈ స‌ర్టిఫికెట్ తీసుకోవాలి. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే అవ‌కాశం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *