పేద యువకుడి ఐడియా..చెట్టుపై ఐసోలేషన్..

 ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుందో లేదో కానీ. ఓ పేద యువకుడికి వచ్చిన ఆలోచన మాత్రం తెగ వైరల్ అవుతోంది. విషయం ఏంటంటే కరోనా విజృంభిస్తోన్న వేళ ఆ యువకుడికి వచ్చిన ఆలోచన ఇది.  కరోనా వస్తే ఖచ్చితంగా ఐసోలేషన్ లో ఉండాలి. లేదంటే ఆ మహమ్మారి మన కుటుంబసభ్యులకు కూడా సోకే ప్రమాదం ఉంది. మనదేశంలో పేద.. మధ్యతరగతి ప్రజలు ఎక్కువ సంఖ్యలో నివసిస్తుంటారు. ఐసోలేషన్ లో ఉండటం వీళ్లకు సాధ్యమేనా.. అంటే కచ్చితంగా కాదనే చెప్పాలి. ఎందుకంటే మనదేశంలోని చాలా కుటుంబాలు ఒకే గదిలో నివసిస్తూ ఉంటారు. కుటుంబంలో నలుగురు లేదా ఐదుగురు ఉంటారు. వారిలో ఎవరికైనా కరోనా వస్తే ఇక ఆ కుటుంబం నరకం అనుభవించాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం కోవిడ్ సెంటర్లు అన్ని బాధితులతో నిండిపోయాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్థానం లేదు. లక్షలు వెచ్చించి ప్రైవేటు ఆస్పత్రికి పేద ప్రజలు వెళ్లలేరు. దీంతో ఓ పేద యువకుడు వినూత్నంగా ఆలోచించాడు. తన ఇంటి వద్ద చెట్టుమీద ఐసోలేషన్ గదిని ఏర్పాటు చేసుకున్నాడు. అతడికి కరోనా సోకడంతో తొమ్మిదిరోజులుగా  ఆ చెట్టుమీదే ఉంటున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారత్ లోని పేదరికానికి ఈ చిత్రం అద్దం పడుతున్నదని కొందరు కామెంట్లు పెడుతున్నారు. నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం కోతనందికొండ కు చెందిన రమావత్ శివకు ఇటీవల కరోనా సోకింది.  ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. అతడి కుటుంబంలో మొత్తం ఐదుగురు ఉంటారు. వారందరికీ ఒకే గది ఉంది. దీంతో ఏం చేయాలో శివకు అర్థం కాలేదు. అందుకే తన ఇంటి ముందు ఉన్న చెట్టుమీద ఓ మంచం ఏర్పాటు చేసుకొని తొమ్మిది రోజులుగా అక్కడే ఉంటున్నాడు. కుటుంబసభ్యులు అతడికి కింద నుంచే ఆహారం అందిస్తున్నారు.దాదాపు తొమ్మిది రోజులుగా శివ చెట్టుమీద నివాసం ఉంటున్నాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో నెటిజన్లను కదిలించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *