ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గుర్రం..మరణించింది..
బిగ్ జాక్..అంటే ఏంటో అనుకోకండి..ఓ గుర్రం పేరు..ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన బెల్జియన్ జాతి గుర్రం బిగ్ జాక్ ఇకలేదు. అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం కొలంబియా కౌంటీలో గల పోయ్‌నెట్టి గ్రామంలోగల ఓ గుర్రపు శాలలో అది మృతిచెందింది. ప్రస్తుతం దాని వయసు 20 ఏండ్లు. రెండు వారాల క్రితం బిగ్ జాక్ మరణించిందని ఆ గుర్రం యజమాని జెర్రీ గిల్బర్ట్ భార్య వలీషియా గిల్బర్ట్ తెలిపారు. అయితే, బిగ్ జాక్ మరణించిన కచ్చితమైన తేదీని ఆమె చెప్పలేకపోయారు.మీ గుర్రపు శాలలో ప్రత్యేక ఆకర్షణగా ఉండే బిగ్ జాక్ మృతితో తాము విషాదంలో మునిగిపోయామని, దాంతో ఆ గుర్రం మరణించిన కచ్చితమైన తేదీని గుర్తుంచుకోలేకపోయామని వలీషియా గిల్బర్ట్ చెప్పారు. బిగ్ జాక్ 6.10 అడుగులు ఎత్తు (2.1 మీటర్లు) ఉండేది. దాని బరువు 1,136 కిలోలు (2,500 పౌండ్లు). అందుకే బతికున్న వాటిలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గుర్రంగా గిన్నిస్ బుక్ రికార్డ్స్ వాళ్లు బిగ్ జాక్‌ను గుర్తించారు.బిగ్ జాక్ తన గుర్రపుశాలలో ఒక సూపర్‌స్టార్ అని దాని యజమాని జెర్రీ గిల్బర్ట్ చెప్పారు. నిజంగా అదొక బ్రహ్మాండమైన గుర్తింపు కలిగిన జంతువని వ్యాఖ్యానించారు. నబ్రాస్కాలో పుట్టిన తన గుర్రం పుట్టుకతోనే 109 కిలోల (240 పౌండ్లు) బరువు తూగిందని చెప్పారు. సాధారణంగా బెల్జియన్ జాతి గుర్రాలు 100 నుంచి 140 పౌండ్ల (45 నుంచి 65 కిలోల) బరువుతో పుడుతాయని, కానీ తన గుర్రం అసాధారణంగా 100 పౌండ్ల అధిక బరువుతో పుట్టిందని ఆయన తెలిపారు.బిగ్ జాక్ జ్ఞాపకంగా అది ఇన్నాళ్లు నివసించిన స్టాల్‌ను ఖాళీగా ఉంచుతానని జెర్రీ గిల్బర్ట్ చెప్పారు. స్టాల్ బయట ఒక ఫలకం ఏర్పాటు చేసి దానిపై బిగ్ జాక్ పేరుతోపాటు బొమ్మ వేయిస్తానని తెలిపారు.