బతికి ఉన్న పాముని తినేసిన యువకుడు..
బతికి ఉన్న పాముని కర కరా నమిలితినేశాడు ఓ యువకుడు. సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకునేందుకు యువత చేయని పనులంటూ లేవు. ఓవర్ నైట్లో పేరు తెచ్చుకోవడానికి వికృత చర్యలకు కూడా పాల్పడుతున్నారు. మూగజీవాలను హింసిస్తూ వీడియోలను సైతం చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ యువకుడి పిచ్చి పరాకాష్టకు చేరింది. వైరల్ కావడం కోసం ఏకంగా బ్రతికున్న పామును తింటూ వీడియో తీశాడు. చిన్న పాముపిల్లను తీసుకుని దాని తలను నోట్లో పెట్టుకుని కరకరా కొరుకుతూ నమిలి మింగాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాపం.! ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ పాము మెలికలు తిరుగుతూ గిలగిలా కొట్టుకుంది. ఈ చర్యకు పాల్పడిన యువకుడి పేరు సాజిద్ అని తెలుస్తోంది. కాగా, క్షణాల్లో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. సదరు యువకుడిని శిక్షించాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్, డీజీపీకి ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశారు.