బోనాల రంగం వినిపించే స్వర్ణలత ఎవరో తెలుసా..

ఆషాడమాసం బోనాలకి ప్రత్యేకం..మరి బోనాలులో రంగం వినిపించే స్వర్ణలత గురించి తెలుసుకుందాం.. సికింద్రాబాద్‌ సమీపంలోని తుకారాంగేట్‌ ఇరుకు గల్లీలో ఒక చిన్న ఇంట్లో బతికే అతి సామాన్య మహిళ ఆమె. నిరంతరం బతుకు పోరాటం చేస్తున్న ఆమెకీ ఒక రోజు ఉంది. ఆ రోజు కోసమే వేల మంది భక్తులు ఎదురు చూస్తుంటారు.ఏడాదికోసారి వినిపించే ఆమె మాటల కోసం అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తారు.హైదరాబాద్‌‌లో బోనాల సందర్భంగా మాతంగి స్వర్ణలత రంగం వినిపించడం ఆనవాయితీ. దీన్ని భవిష్యవాణిగా భక్తులు విశ్వసిస్తారు.స్వర్ణమ్మ ఎవరో.. ఆమె నేపథ్యమేంటో ఆమె మాటల్లోనే..చిన్న తనంలోనే 1997లో ముత్యాలమ్మ గుడిలో నాకు కత్తితో పెళ్లి జరిపించారు. ఎంతో సందడిగా ఆ పెళ్లి జరిగింది. ఆ తర్వాత నా జీవితం మహంకాళి అమ్మ సేవకే అంకితమైంది. పదోతరగతి వరకు చదువుకున్నా. అప్పటి నుంచే భవిష్యవాణి వినిపిస్తున్నా.మాది ‘ఏర్పుల’ వంశం. మొదట ఏర్పుల జోగమ్మతో ‘రంగం’ మొదలైంది. ఆ తరువాత ఏర్పుల బాలమ్మ, ఏర్పుల పోశమ్మ, ఏర్పుల బాగమ్మ ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు. 1996 వరకూ మా అక్క ఏర్పుల స్వరూపారాణి రంగం ఎక్కి భవిష్యవాణి వినిపించారు.అక్కతో కలిసి నేనూ గుడికి వచ్చేదాన్ని. ఆమె వారసత్వంగానే 1997 నుంచి నేటి వరకు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నా. మా నాయిన ఏర్పుల నర్సింహ అమ్మవారి గుడి దగ్గర పంబజోడు వాయించేవారు. మా అమ్మ ఇస్తారమ్మ నాయినతో పాటు గుడికొచ్చి జేగంట మోగించేది. అమ్మా,నాన్నలు చనిపోయారు. ఇప్పుడు ఇంట్లో నేను,పిన్ని, వదిన, మా తమ్ముళ్లు ఉంటున్నాం.మాతంగి అంటే ఎవరూ ఇల్లు ఇవ్వడానికి ముందుకు రారు. అతి కష్టం మీద ఒక చిన్న కిరాయి ఇంట్లో బతుకుతున్నాం. అందుకే మీరు మా ఇంట్లో వీడియో తీసుకుంటానంటే వద్దన్నది.నేను అతి సాధారణ టైలర్‌ని. ఏ రోజుకు ఆ రోజు పని చేస్తే తప్ప పూటగడవదు. రవికెలు, ఇతర దుస్తులు కుడతాను. నెలకు రూ.1500 కూడా రావు. తమ్ముడు దినేశ్ ఎలక్ట్రీషియన్‌. ఇద్దరం కష్టపడితే తప్ప ఇల్లు గడవదు. దేవస్థానం వారు, నెలకు రూ.3000 ఇస్తున్నరు..డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు ఇస్తామన్నారు కానీ,అదింకా కార్యరూపం దాల్చలేదు. రంగం రోజున ప్రభుత్వం తరపున పసుపు కుంకుమ సారె ఇస్తారేమోనని ప్రతీ సంవత్సరం ఆశపడుతున్నా, కానీ తీరడం లేదు. కుటుంబంలో పుట్టే ఆడబిడ్డలంతా అమ్మవారికే అంకితం. ఇప్పటివరకు మాతంగులైన వాళ్లంతా నాతో సహా పెళ్లిళ్లు చేసుకోకుండా తమను మహంకాళికి సమర్పించుకున్నారు. మా తమ్ముడికి ఆడపిల్ల పుడితే, నా తరువాత ఆమే భవిష్యవాణి వినిపిస్తుంది. వేదికను మా తమ్ముడు దినేశ్ అలంకరిస్తాడు. పచ్చికుండను భూమిలోకి పాతి, దాని చుట్టూ బియ్యంతో ముగ్గులు వేసి పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. ఆ సమయంలో కొత్త బట్టలు పెట్టి నాకు ఒడి బియ్యం పోసి ఎదుర్కొని వస్తారు. రంగం దగ్గరకు వస్తాను. ఆ తరువాత ఏం జరుగుతుందో నాకు తెలియదు…” అంటూ ఆమె ముగించారు. ‘రంగం’ సమయంలో పసుపు కుంకుమలతో అలంకరించుకొని నిండైన విగ్రహంలా కదిలి వచ్చే మాతంగి స్వర్ణలత రూపం.. మాటలు వైవిధ్యంగా ఉంటాయి.ఆమె సాధారణ జీవితానికి పూర్తి భిన్నంగా ఉంటాయి. ఆ చివరి అంకంలో పదిహేను నిమిషాల పాటు భవిష్యవాణి వినిపిస్తుంది. ఆమె చెప్పే ముచ్చట కోసం వేల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు.ప్రభుత్వం నుంచి సారె అందడం లేదు అని నిరాశ వ్యక్తంచేస్తున్న స్వర్ణలతకు మీరేమైనా సహకరిస్తారా? అని.. ఉజ్జయిని మహంకాళి ఆలయ ఈవో అన్నపూర్ణ ను ప్రశ్నించగా.. దేవదాయ శాఖ ఉత్తర్వుల ప్రకారం మాతంగి స్వర్ణలతకు గత 12సంవత్సరాలుగా నెలకు రూ. 3వేలు గౌరవ వేతనం ఇస్తున్నాం. ‘రంగం’ రోజున ఆమెకు నచ్చిన పట్టుచీరె, పసుపు, కుంకుమను దేవాలయం తరపున సమర్పిస్తున్నాం. ఇక్కడే కాక మిగతా ఆలయాలలో కూడా ఆమె ‘రంగం’ చెప్పు కొని కొంత ఆదాయం పొందుతున్నారు” అని అన్నారు.రెండు వందల ఏళ్ల కిందట నిర్మించిన ఈ ఆలయ నిర్మాత వారసులు మాట్లాడుతూ ఆలయానికి 200 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పారు. ” 1813లో సైన్యంలో పనిచేస్తున్న సికింద్రాబాద్‌కు చెందిన సురిటి అప్పయ్య మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ టవర్‌కు బదిలీ అయ్యాడు. ఆ సమయంలో జంటనగరాల్లో కలరా సోకి వేల మంది మరణించారు. అప్పుడు అప్పయ్య ఉజ్జయినీలో శ్రీ మహంకాళి దేవీని దర్శించి కలరా వ్యాధి నుంచి కాపాడితే, సికింద్రాబాద్‌లో విగ్రహ ప్రతిష్టచేయించి ఆలయం నిర్మిస్తామని కోరుకున్నాడు. 1815లో కలపతో అమ్మవారి విగ్రహన్ని చేయించి ప్రతిష్ఠచేశారు.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *