భారత్ కి కరోనా థర్డ్ వేవ్ ముప్పు తప్పదా..
ఇప్పటి వరకు కరోనా ఫస్ట్ వేవ్..సెకండ్ వేవ్ లతో సతమతమయ్యాం..అయితే రీసెంట్ గా కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి నుంచి భారత్ క్రమంగా కోలుకుంటోంది. ఇప్పుడిప్పుడే రోజువారీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రాలు ఆంక్షలు సడలిస్తున్నాయి. ఆసుపత్రులు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై ఒత్తిడి తగ్గుతోంది. ఈ తరుణంలో మరో వార్త అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. భారత్ కు థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అక్టోబర్ నాటికే దేశంలో కొవిడ్ థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. మరోసారి విజృంభణ తప్పదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.థర్డ్ వేవ్ ముప్పు సాధ్యాసాధ్యాలపై ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఓ సర్వే నిర్వహించింది. ఆ సర్వే ప్రకారం భారత్ కు అక్టోబర్ లోనే థర్డ్ వవ్ ముపు పొంచి ఉన్నట్టు తేలింది. జూన్ 3-17 మధ్య జరిగిన ఈ సర్వేలో వైద్యులు, ఆరోగ్యసంరక్షణా నిపుణులు, శాస్త్రవేత్తలు, వైరాలజిస్టులు, ఎపిడెమాలజిస్టులు, ప్రొఫెసర్లు మొత్తం 40 మంది ప్రముఖులు పాల్గొన్నారు.భారత్‌లో అక్టోబర్ నాటికి కరోనా థర్డ్ వేవ్ రానున్నట్లు 21 మంది నిపుణులు హెచ్చరించారు. మరో ముగ్గురు ఆగస్టు నాటికి.. మరో 12 మంది సెప్టెంబర్ కల్లా భారత్‌లో మరోసారి కరోనా విజృంభించొచ్చని అంచనా వేశారు. ఇక మిగిలిన ముగ్గురు నవంబర్-డిసెంబర్ మధ్య థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని తెలిపారు.అయితే, రెండో దశ కరోనాతో పోలిస్తే థర్డ్ వేవ్‌ను నియంత్రించగలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని 34 మందిలో 24 మంది అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్లు, ఔషధాలు, ఆక్సిజన్, ఆసుపత్రుల్లో పడకలు వంటి వసతులు మెరుగుపడ్డాయని, లేదంటే థర్డ్ వేవ్ ప్రభావం ఘోరంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. విస్తృత స్థాయిలో వ్యాక్సినేషన్ అందుబాటులోకి రావడం, రెండో దశ ఉద్ధృతి వల్ల వచ్చిన సహజ రోగనిరోధక వ్యవస్థ వంటి అంశాలు థర్డ్ వేవ్‌ను నియంత్రణలో ఉంచనున్నాయని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా వెల్లడించారు.ఈ ఏడాదే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కానున్నట్లు అత్యధిక మంది ఆరోగ్యసంరక్షణ నిపుణులు తెలిపారు. అలాగే కొన్ని రాష్ట్రాలు కరోనా కట్టడి కోసం విధించిన ఆంక్షల్ని సరళతరం చేయడాన్ని నిపుణులు హెచ్చరించారు. ఇక మూడో దశ ముప్పు పిల్లలపై అధిక ప్రభావం చూపనుందా అన్న ప్రశ్నకు 40లో 26 మంది అవుననే తెలిపారు. వారికి ఇప్పటివరకు వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడమే అందుకు కారణమని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్’ ఎపిడెమాలజీ విభాగాధిపతి డాక్టర్ ప్రదీప్ బనదూర్ అభిప్రాయపడ్డారు.పిల్లలు భారీ సంఖ్యలో కరోనా బారిన పడితే ప్రభావం ఘోరంగా ఉండే అవకాశం ఉందని నారాయణ హెల్త్‌కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ దేవి శెట్టి తెలిపారు. పిల్లలకు సంబంధించిన ఐసీయూలు, ఇతర ఆరోగ్య సంరక్షణా వసతులు తక్కువగా ఉండడమే అందుకు కారణమని వెల్లడించారు. కానీ 14 మంది నిపుణులు మాత్రం పిల్లలకు ఎలాంటి ముప్పు ఉండబోదని తెలిపారు.భవిష్యత్తులో రాబోయే కరోనా వేరియంట్లు వ్యాక్సిన్లను నిరుపయోగంగా మార్చే అవకాశాలు తక్కువేనని 38 మందిలో 25 మంది నిపుణులు తెలిపారు. అలాగే మరో ఏడాది పాటు భారత్‌లో కరోనా ముప్పు ఉండనుందని 30 మంది నిపుణులు హెచ్చరించారు. మరో 11 మంది కరోనా ప్రభావం దేశంలో ఏడాది కంటే తక్కువేనని.. 15 మంది రెండేళ్ల లోపేనని.. 13 మంది రెండేళ్లపైనే ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఇక ఇద్దరైతే కరోనా ముప్పు ఎప్పటికీ కొనసాగేప్రమాదం ఉందని అంచనా వేశారు.కొవిడ్ పరిష్కరించగలిగే సమస్యేనని.. వ్యాక్సిన్ ద్వారా దీనికి పరిష్కారం దొరికినట్లేనని యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్కు చెందిన ప్రముఖ నిపుణుడు రాబర్ట్ గాల్లో తెలిపారు. భారత్‌లో మరో రెండేళ్లలో వ్యాక్సిన్ల మూలంగా హెర్డ్ ఇమ్యూనిటీ రానుందని అంచనా వేశారు.