మంచు..ఎండ..వర్షం ఎక్కడో తెలుసా..
ఎంతో ఎత్తులో ఉండే ప్రాంతం..చుట్టు పచ్చదనం..నిత్యం చల్లదనం ఇది అక్కడి పరిస్థితి. ఇప్పుడు ఓ వింత చోటు చేసుకుంటుందట అక్కడ. ఇంతకీ ఎక్కడ అనుకుంటున్నారా అదే పాడేరు. ఈ ప్రాంతంలో వింత వాతావరణం నెలకొంటోంది. ఉదయం సమయంలో పొగమంచు దట్టంగా కురుస్తుండగా, మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోతూ, ఆ తర్వాత వాతావరణం చల్లబడి వర్షాలు కురవడం ఇటీవల నిత్యకృత్యంగా మారింది. కాగా హుకుంపేట, పాడేరు రోడ్డులో పొగమంచు దట్టంగా కురిసింది. శీతాకాలం తలపించే విధంగా పొగమంచుతో గిరిజనులు అవస్థలు పడ్డారు. పాడేరు ఘాట్ తో పాటు పలు గ్రామాల్లో మధ్యాహ్నం నుంచి వర్షం కురవగా రెండు గంటల నుంచి పాడేరు పట్టణంతో పాటు పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వర్షాలు ఖరీఫ్ వ్యవసాయానికి ఎంతో మేలు చేస్తాయని గిరిజన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉదయం మంచు, మధ్యాహ్నం వరకు ఎండ ఆ తరువాత మంచి వర్షాలు వంటి విభిన్న వాతావరణం గిరిజనుల ఆరోగ్యానికి ప్రమాదం ఉందని అంటున్నారు.