మీడియాను తిట్టడమే ప్యాషనా?

ప్రతి ఒక్కరికి మీడియాను అనడం ఫ్యాషనైపోయింది. ఆరేళ్ల పాప విషయంలో మీడియా ఇంకా ఏం చేయాలి??

1) హత్యాచారం చేసినవాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. జైల్లో పెట్టారు. ఇప్పుడు మీడియా ఏం చేయాలి? వాళ్ల ఇంటికి వెళ్లి ఇంటర్వ్యూ తీసుకోవాలా?
* నిర్భయ, దిశ వంటి సంఘటనల సమయం లో నిందితులు దొరకలేదు కాబట్టి.. దొరికేదాకా మీడియాలో కథనాలు వచ్చాయి.

2) ఆరేళ్ల పాపను ఎలా చంపాడో మీడియా ఒక రోజంతా ప్రోగ్రాం పెడితే బాగుండేదా??
* మీది ఏం పోయింది.. సోషల్ మీడియాలో ఏదైనా సులభంగా ఫార్వర్డ్ చేస్తారు. కానీ రేప్ జరిగినప్పుడు ఇష్టం వచ్చినట్టు వార్తలు ఇచ్చే స్వేచ్ఛ మీడియాకు లేదు. బాధితురాలి పేరును పలకవద్దు అని, ఆమె ఫోటో వేయొద్దని, బాధితురాలి కుటుంబం మనోభావాలు దెబ్బతినేలా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా అనేక ఆంక్షలు పెట్టింది. ఎక్స్ట్రాలు చేస్తే కేసులు వేస్తారు. కోర్టు ఛానల్ ను మూసేస్తుంది. అయినా సరే నిందితులు దొరకని కేసుల్లో మీడియా కీలకంగా వ్యవహరించింది. దీనికి అభయ, దిశ, అసిఫా సంఘటనలే ఉదాహరణ.

3) ఆరు నెలల కింద హైదరాబాదులో ఒక అమ్మాయి తనను ఆటోడ్రైవర్లు గ్యాంగ్ రేప్ చేశారని పోలీసులకు కంప్లైంట్ చేసింది గుర్తుందా. అప్పుడు మీడియా అనేక కథనాలను ప్రసారం చేసింది. అది ఫేక్ అని తేలగానే.. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఆ వెంటనే సోషల్ మీడియాలో మీడియాపై తిట్లదండకం మొదలైంది.
* మీరే చెప్పండి.. ఒక రేప్ అండ్ మర్డర్ జరిగితే టీవీలో ఎన్ని గంటల సేపు కార్యక్రమం కావాలి? పత్రికల్లో ఎంత పెద్ద ఫోటోలు వాడాలి?. ఎన్ని రోజులు ఆ వార్తలను వేస్తూ ఉండాలి?.

జమ్మూకాశ్మీర్లో ఒక పాపను హత్య చేస్తే మన ఊర్లో ర్యాలీలు చేశారు. మరి హైదరాబాదులో సంఘటన జరిగితే.. మీడియా ని తిట్టడం తప్ప ఏం చేస్తున్నారు? కనీసం ఒక్కడైనా రోడ్డు మీదికి వచ్చి “జస్టిస్ ఫర్ గర్ల్” అని బోర్డు పట్టుకొన్నాడా?. ఒక్క క్యాండిల్ అయినా వెలిగించాడా?.

గడప దాటకుండా జస్ట్ ఒక షేర్ బటన్ కొట్టి.. రెండు డిజిటల్ కన్నీళ్లు కారిస్తే సరిపోతుందని అని అనుకుంటున్నారు. పౌర సమాజం చేష్టలుడిగి చూస్తుంటే.. ప్రశ్నించాల్సిన యువత డిజిటల్ మాయలో పడి కొట్టుకుంటుంటే.. మీడియా మాత్రం ఏం చేస్తుంది?

జరిగింది ఒక పెద్ద తప్పే.. కానీ మనం స్పందించే విధానమే మారింది. సిరియాలో మారణహోమం జరుగుతోందని కన్నీళ్లు కార్చిన మనం.. చైత్ర విషయంలో ఫెయిల్ అయ్యాం. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీడియాను అంటే సరిపోదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *