ముట్టుకోకుండానే ఏటీఎంలో డబ్బులు విత్‌డ్రా
కరోనా నేపథ్యంలో చాలా బ్యాంకులు ఏటీఎంలలో ముట్టుకోకుండానే డబ్బులు విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని పరిశీలించాయి. కానీ అది పూర్తిగా సాధ్యం కాలేదు. ఇప్పుడు మాస్టర్‌కార్డ్ మాత్రం ఏజీఎస్ ట్రాన్‌సక్ట్ టెక్నాలజీస్‌తో కలిసి పూర్తి కాంటాక్ట్ లెస్‌గా క్యాష్ విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.
కాంటాక్ట్ లెస్ విత్‌డ్రా ఇలా..
దీనికోసం యూజర్లు తమ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్ నుంచి ఏటీఎం స్క్రీన్‌పై కనిపించే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఎంత డబ్బు కావాలన్నదానితోపాటు పిన్ నంబర్ కూడా యాప్‌లోనే ఎంటర్ చేయాలి. ఆ వెంటనే ఏటీఎంలో నుంచి డబ్బులు బయటకు వస్తాయి. నిజానికి ఇప్పటికే ఈ అవకాశం ఉన్నా.. విత్‌డ్రా చేయాల్సిన డబ్బు కోసమైనా కస్టమర్ ఏటీఎంను తాకాల్సి వచ్చేదని, తాము మాత్రం పూర్తి కాంటాక్ట్ లెస్ పరిష్కారాన్ని కనుగొన్నట్లు ఏజీఎస్ గ్రూప్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మహేష్ పటేల్ తెలిపారు. మాస్టర్‌కార్డ్ నెట్‌వర్క్ ఉపయోగించే బ్యాంకులు ఈ ఏజీఎస్ ట్రాన్‌సక్ట్ టెక్నాలజీ ద్వారా తమ కస్టమర్లకు ఈ అవకాశాన్ని అందించవచ్చు. ఇది ఈ కరోనా సమయంలో బాగా ఉపయోగపడటంతోపాటు ఏటీఎం దగ్గర జరిగే మోసాలను కూడా తగ్గిస్తుందని మహేష్ పటేల్ చెప్పారు.