మెగాస్టార్ మరో రీమేక్?
తెలుగు సినీరంగంలో మెగాస్టార్ అంటే తెలియనివారు ఉండరు. చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. చిరు తాజాగా చేసిన సినిమా ఆచార్య. ఈ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతుంది. ఈ సినిమా తరువాత చిరు లూసిఫర్ సినిమా రీమేక్ చేయనున్నారు. లూసిఫర్ రీమేక్‌ను మోహన్ రాజా దర్శకత్వంలో ఫిబ్రవరిలో సెట్స్ పైకి తీసుకెళ్లి ఏప్రిల్ సమయానికి పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ఆ తరువాత చిరు మరో రీమేక్ సినిమా లైన్‌లో పెట్టిన విషయం తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం సినిమాను చేయనున్నారు. ఇప్పటివరకు చిరు లైన్‌లో పెట్టిన సినిమాలు ఇవి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిరు మరో రీమేక్‌ను ఖరారు చేశారట. అజిత్ హీరోగా 2015లో రిలీజ్ అయిన ఎన్నై అరిందాల్ భారీ హిట్ అయింది. ఈ సినిమా తెలుగులో ‘ఎంతవాడు గాని’ పేరుతో విడుదలయ్యి హిట్ అయింది. ఇప్పుడు చిరు ఈ సినిమాను రేమేక్ చేయాలని ఆలోచిస్తున్నారని, ఈ కథకు సరైన దర్శకుడి కోసం వెతుకుతున్నారని సమాచారం. మరి ఈ విషయం ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.