మ‌రోసారి వేలానికి డ‌య‌నా పెళ్లి కేక్-ధ‌ర ఎంతో తెలుసా..!

కేక్ ని మ‌హా అయితే ఎన్ని రోజులు నిల్వ ఉంచ‌గ‌లం..ఓ నెల‌..రెండు..కాదంటే మూడు నెల‌లు అంత‌కు మించి ఉంచితే తిన‌డానికి ప‌నికిరాద‌నే సంగ‌తి తెలిసిందే.కానీ 40ఏళ్ళ‌నాటి కేక్ ఇప్పుడు వేలానికి వ‌చ్చింది..ఆ వివ‌రాలు చూద్దాం. పురాతన కాలం నాటి వస్తువులు.. ముఖ్యంగా రాజ వంశానికి చెందిన వారు వినియోగించిన వస్తువులంటే చాలామంది అమితాసక్తి కనబరుస్తుంటారు. ఈ తరహా వస్తువులు వేలానికి పెడితే రూ.లక్షలు, రూ.కోట్లు పెట్టి కొనుగోలు చేస్తుంటారు. అయితే వేలం పాటలో వస్తువులను సొంతం చేసుకుంటే పర్లేదు కానీ.. మరీ ఏళ్ల క్రితం నాటి ఆహారాన్ని తెచ్చుకుంటే ఏం లాభం ఉంటుంది. దాని తినలేం.. బయట పడేయలేం. వాసన రాకుండా జాగ్రత్తగా దాచుకోవాల్సిందే. 40 ఏళ్ల క్రితం నాటి ఓ కేకు ముక్క ఒకటి వేలానికి రాబోతుంది. అది కూడా బ్రిటన్‌ రాణి డయనా పెళ్లి నాటి కేకు కావడంతో చాలా మంది దీని వేలం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రిన్సెస్ డయానా-ప్రిన్స్ చార్లెస్ వివాహ సందర్భంగా 1981లో తయారుచేసిన కేక్ అది. దానిపై జులై 29, 1981 అని డేట్‌ రాసి ఉంది. ఇది మార్జిపాన్ బేస్, షుగర్ ఆన్‌లే కోట్-ఆఫ్-ఆర్మ్స్, పైన బంగారం, ఎరుపు, నీలం వెండి రంగులతో అలంకరించి ఉంది.ఈ కేక్‌ ముక్కను క్లారెన్స్ హౌస్‌లోని రాణి తల్లిగారి ఇంటి సభ్యురాలైన మొయిరా స్మిత్‌కు అప్పట్లో పంపించగా… ఆమె దీన్ని ఓ పూల కేక్‌ టిన్‌లో భద్రపరిచింది. ఈ టిన్‌ మూత మీద చేతితో తయారు చేసిన లేబుల్‌ అంటించి ఉంది. దాని మీద ‘చాలా జాగ్రత్తగా పట్టుకొండి.. ఇది ప్రిన్స్‌ చార్లెస్‌-ప్రిన్సెస్‌ డయానాల వివాహ కేక్‌’ అని ఉంది. స్మిత్‌ కుటుంబ సభ్యులు 2008లో ఈ కేక్‌ను ఓ వ్యక్తికి అమ్మగా… ఆయన దాన్ని 2011లో వేలం వేసి మరొకరిని అమ్మాడు. ఈ కేక్‌ ముక్క మరోసారి వేలానికి రావడంతో 300-500 పౌండ్ల (31,027-51,712) ధర పలుకుతుందని భావిస్తున్నారు. ఈ కేక్‌ ముక్క వేలం పాట సందర్భంగా సర్వీస్ ఆర్డర్, వేడుక వివరాలు, ఒక రాయల్ వెడ్డింగ్ అల్పాహార కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా డోమినిక్‌ వింటర్‌ ఔక్షనీర్స్‌ సీనియర్‌ సభ్యుడు మాట్లాడుతూ.. ఈ కేక్‌ 40 ఏళ్ల క్రితం అమ్మినప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడూ అంతే తాజాగా ఉంది. అలాగని దాన్ని పొరపాటున కూడా తినకూడదు’ అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *