రాజన్న రాజ్యం తెస్తా: వైఎస్ షర్మిల

తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని వైఎస్‌ షర్మిల చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల హైదరాబాద్ లోటస్‌ పాండ్‌లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ముఖ్య నేతలతో సమావేశం ముగిసిన తర్వాత షర్మిల మాట్లాడుతూ.. ”ఇప్పుడు తెలంగాణలో రాజన్న రాజ్యం లేదు. రాజన్న రాజ్యం ఎందుకు రాకూడదు. తెలంగాణలో వైఎస్సార్‌ లేని లోటు కనిపిస్తున్నది. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తాం. ఇవాళ నల్లగొండ జిల్లా నేతలతో మాట్లాడా. మిగిలిన జిల్లాల నేతలతోనూ మాట్లాడతా. క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకునేందుకే సమావేశాలు. త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తా” అని షర్మిల తెలిపారు. ఇంటి వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా అభిమానులు షర్మిలపై కాగితపు పూల వర్షం కురిపించారు. టపాకాలు కాలుస్తూ.. నృత్యాలతో సందడి చేశారు.

వైఎస్సార్‌ అభిమానులారా తరలి రండి.. అని గతంలో వైఎస్‌తో అనుబంధం ఉన్న నేతలకు, ఆయనతో పని చేసిన వారికి షర్మిల తరఫున ఫోన్‌ చేసి సమావేశానికి ఆహ్వానించారు. షర్మిల ఇంటి పరిసర ప్రాంతాల్లో భారీగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్లెక్సీలపై ఎక్కడా సీఎం జగన్‌ ఫొటోలు లేకుండా.. షర్మిల ఫొటోలను మాత్రమే ఏర్పాటు చేశారు. వైఎస్‌ అభిమానులు షర్మిల ఇంటికి భారీగా చేరుకోవడంతో ఆ ప్రాంతంలో కోలాహలం నెలకొంది. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టబోతున్నారనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో పార్టీ ఏర్పాటుపై షర్మిల క్లారిటీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *