లగ్జరీ లైఫ్ వీడి..అడవుల్లో దంపతులు..ఎందుకో తెలుసా..

ఒక్కోసారి ఎంత సంపాదించినా ఆనందం అనేది దొరకదు..సంతృప్తిగా అనిపించదు లైఫ్..అందుకే వారు అడవుల బాట పట్టారు..మరి ఆ విషయాలు ఏంటో చూద్దాం.. అద్దాల మేడలు, ఏసీ సౌకర్యం, చిటికేస్తే అన్నీ టేబుల్‌ దగ్గరికే వచ్చే లగ్జరీ లైఫ్‌.. ఢిల్లీకి చెందిన అదితి, అనిల్‌ దంపతులు వీటన్నిటినీ వదిలేశారు. జనానికి దూరంగా ఉందామని అడవిలోకి వచ్చేశారు. 5 వేల అడుగుల ఎత్తయిన కొండపై.. చుట్టూ పచ్చని ప్రకృతి నడుమ, ఒక ఇల్లు కట్టుకొని సామాన్యంగా బతుకుతూ.. ఆనందం డబ్బులోనో సంపాదనలోనో లేదనీ, ప్రకృతి ఒడిలో స్వేచ్ఛగా బతకడంలోనే ఉందనీ చాటి చెబుతున్నారు.చెరుకుపల్లి అనిల్‌, అదితి ఢిల్లీలో స్థిరపడ్డారు. విలాసవంతమైన జీవితం. లక్షల రూపాయల జీతం. ఇవేవీ వాళ్లకు సంతృప్తినివ్వలేదు. యాంత్రిక జీవనశైలి, యంత్రాలతో సహవాసం బోరింగ్‌గా అనిపించింది. తినే తిండి, తాగేనీళ్లు అన్నీ కల్తీయే. జనం విలాసాలకు అలవాటు పడ్డారు. ‘ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్‌ తరాలు బతకడం కష్టమే’ అనుకున్నారు. పౌష్టికాహారం, వ్యాయామం, ప్రకృతిలో భాగమైన జీవన విధానమైతే బాగుండునని భావించారు. సుస్థిర జీవన విధానం కోసమే.. నగర జీవితాన్ని విడిచి పెట్టి, ఢిల్లీనుంచి ఉత్తరాఖండ్‌లోని కుమావున్‌ ఫూట్‌హిల్స్‌కు షిఫ్ట్‌ అయ్యారు. అక్కడికి వెళ్తే.. ప్రత్యేక ప్రపంచంలో ఉన్న అనుభూతి కలుగుతుంది.అప్పటికే అక్కడొక పాత ఇల్లు ఉంది. కానీ, అది సరిపోదు. దానిని కూలదోయాలనే ఉద్దేశం అసలే లేదు. ఆర్కిటెక్చర్‌మీద ఎలాంటి అవగాహన లేదు. అయితేనేం, నెలల తరబడి పరిశోధించి, తమ కలకు రూపం తీసుకురావడానికి ప్రణాళిక వేసుకున్నారు. కలపను, రాతిని రీసైకిల్‌ చేసి ముందుగా ఉన్న ఇంటిని పైకి లేపారు. సౌరశక్తి, సేంద్రియ వ్యవసాయం, వ్యర్థ పదార్థాల నిర్వహణ వంటి పద్ధతులతో ముడిపడి తమ ఇల్లు ఉండాలని అనుకున్నారు. భూకంపాన్ని తట్టుకునే నిర్మాణ పద్ధతుల్లో నిర్మించారు. రాయి, కలపను మాత్రమే ఉపయోగించారు. పర్వత వాలుపై భవనం ఒత్తిడిని తగ్గించేలా డిజైన్‌ చేశారు. ఇంటి నిర్మాణం కోసం చెట్లను నరికేయడానికి ఏ మాత్రంఇష్టపడలేదు.చిన్న ఇంటినే మూడంతస్తులుగా మలిచారు. చుట్టూ అడవి, మధ్యలో నివాసం. దానికి ఒక పక్కన నైనిటాల్‌ పర్వతాలు. ఇంకో పక్కన పాంగోట్‌ పర్వతాలు. ఇరువైపులా జలపాతాలు. ఓ కొత్త జీవితాన్ని అనుభవిస్తున్నారు అనిల్‌ దంపతులు. 2018లో మొదలుపెట్టిన ఈ ఇంటి నిర్మాణం పూర్తవడానికి రెండేండ్ల సమయం పట్టింది. స్వతహాగా ఇద్దరూ పర్యాటక ప్రియులే, పర్యావరణ ప్రేమికులే. గతంలో పర్యావరణ పరిరక్షణ కోసం ఎన్‌జీవోలతో కలిసి పనిచేశారు. ఆ అనుభవం కూడా కలల సౌధాన్ని నిర్మించుకోవడానికి ఉపయోగపడింది. సహజ కాంతిని పుష్కలంగా అనుమతించే కిటికీలను అమర్చారు. స్నానాల గదులుకోసం సౌర వ్యవస్థను ఎంచుకొన్నారు. రోజూ 5-6 యూనిట్లను ఉత్పత్తి చేసే సౌరశక్తి ఇన్వర్టర్‌ వ్యవస్థను ఏర్పరిచారు. ఇంకే ముంది, ఇల్లు సిద్ధమైంది..ఇల్లు సరే, ఇప్పుడు వాళ్లకు కావాల్సింది ఆహారం. అదెక్కడి నుంచో తీసుకు రావాల్సిన అవసరం లేదు. తమ పొలంలో తామే పండించిన నాణ్యమైన ఆహారం తింటూ ఆరోగ్యంగా ఉండాలన్నది ఆ దంపతుల ఆలోచన. సహజ ఎరువులను ఉపయోగించి అల్లం, దోస, గుమ్మడి, క్యాప్సికం, వంకాయలు తదితర సేంద్రియ పంటలను సాగు చేస్తున్నారు. మురుగునీటిని ట్విన్‌పిట్‌ టాయిలెట్‌ సిస్టమ్‌ ద్వారా ఎరువులుగా మారుస్తున్నారు. ఇంటి తడి వ్యర్థాలను కంపోస్ట్‌గా వాడుతున్నారు. ఇలా ఇంటిని పూర్తిగా హరిత, సౌర, పర్యావరణ యుతంగా మార్చేసి, కొండా కోనల మధ్యలో కొత్త జీవితం గడుపుతున్నారు. ‘ఇదే మా ప్రపంచం.. ఈ జీవితమే మేం కోరుకున్నది’ అంటుందా జంట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *