విమోచనమా.. విలీనమా.. ఎవరిది చిత్తశుద్ధి.. ఎవరిది రాజకీయం

నీ కాల్లు మోక్కుతా… నీ బాంచన్ దొర…. అన్న నోళ్లే… బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఎ బండ్ల పోతవ్ కొడుకో నైజాం సర్కారోడా… గొల్కోండ కోట కింద నీ గోరి కడతం… అని నినదించాయి… వంగి వంగి దండాలు పెట్టిన చేతులే… ఉక్కు పిడిక్కిలై యుద్ధం చేసినై… ప్రంపంచలోనే అత్యంత ధనవంతమైన నైజాం రాజును పూట గడవని పేదలు… అడుగు భూమి లేని నిరుపేదలు ఓడించారు… ప్రంపంచ దేశాల్లో అనేక ఉద్యమాలకు స్ఫూర్తి నింపింది తెలంగాణ సాయుధ పోరాటం. నేడు ప్రపంచ యువత తమ ఐకాన్ గా భావిస్తున్న చేగువిరాలో స్ఫూర్తి నింపింది తెలంగాణ సాయుధ పోరాటం.

*సాయుధ పోరాటం ఎవరితో.. ఎందుకు*

తెలంగాణ సాయుధ పోరాటం ఓ మతానికి వ్యతిరేకంగా జరిగితే వందలాది ముస్లింలు దండు కట్టి రజాకార్ల మీద ఎందుకు పోరాటం చేశారు. ఓ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా సాగితే.. భీంరెడ్డి నర్సింహా రెడ్డి లాంటి వారు ఎందుకు దళం నడిపారు. ఈ పోరాటం ఓ ప్రాంతానికే చెందినదైతే పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వారు ఎందుకు నాయకత్వం వహించారు. నేటి యువత, ప్రజలు ఈ అంశాలను ఆలోచించాలి. సాయుధ పోరాటం భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగింది. ముమ్మాటికీ నిరంకుశ పాలకులకు మట్టి మనుషులకు మధ్య జరిగిన యుద్ధం. తమ మాన ప్రాణాలు కాపాడుకునేందుకు.. ఆత్మగౌరవం నిలుపుకునేందుకు కుల, మత, లింగ భేదం లేకుండా జంగు కట్టారు. ప్రాణాలకు తెగించి పోరాటం చేశారు. 1948 సెప్టెంబర్ 17 తేదీన బానిస సంకెళ్లు తెంచారు. భారత యూనియన్ లో హైదరాబాద్ సంస్థానం కలిసిపోయింది.

*అధికారిక నిర్వహణపై రాజకీయం*

నిజాం కబంధ హస్తాల నుంచి విముక్తి పొంది హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది. భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ప్రధాన భాగం ఆంధ్రాలో.. కొంత భాగం మహారాష్ట్రలో.. మరికొంత కర్నాటకలో కలిసింది. కర్నాటక, మహారాష్ట్రలో నాటి నుంచి సెప్టెంబర్ 17 తేదీన అధికారికంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇలానే అనేక సంస్థానాలు భారత యూనియన్ లో విలీనం అయ్యాయి. ఆయా తేదీల్లో ఆ ప్రాంతాల్లో అధికారికంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ఇక్కడ అధికారిక నిర్వహణ లేదు. సెప్టెంబర్ 17 రాజకీయ పార్టీలు ఎవరి స్వార్థానికి వారు వాడుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో.. అధికారికంగా ఎందుకు నిర్వహించరు.. సన్నాసులు.. చవటాలు అంటూ నాటి పాలకులను తిట్టి పోశాడు. యువతను రెచ్చగొట్టాడు. తీరా తానే అధికారంలోకి వచ్చాకా.. తెలంగాణ పోరాట చరిత్రలో తను తప్ప మరొకరు ఉండొద్దు అన్న స్వార్థంతో ప్లేట్ ఫిరాయించాడు. రాష్ట్రంలో తమ మనుగడ కోసం కాషాయం పార్టీ రెండు మతాల మధ్య పోరాటం జరిగింది అని తప్పుడు భాష్యం చెబుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న తాము మాత్రం అధికారిక హోదా ఇవ్వరు. కానీ.. దిల్లీ నుంచి పెద్దపెద్ద నాయకులు వచ్చి రాష్ట్రం ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ మాత్రం చేస్తారు. సాయుధ పోరాట సమయంలో.. తర్వాత కూడా ప్రభుత్వం అనేక మంది వీరులను జైళ్లలో పెట్టి చిత్రహింసలు పెట్టారు. నిరంకుశంగా పరిపాలించిన నిజాం ప్రభువుకు హోదా, ప్రజలను బానిసలుగా చేసుకుని వెట్టి చాకిరి చేయించుకున్న దొరలకు దేశ్ ముఖ్ హోదాలు ఇచ్చింది. పైపెచ్చు దొరలకు గాంధీ టోపి పెట్టి నాయకులను చేసి.. చట్టాన్ని చుట్టం చేశారు. ఇదంతా చేసిందే నాటి కాంగ్రేస్ పాలకులు. దొరల ఘడీలకు కాపలాకాసిన నెహ్రూ సైన్యాలు.. ఆ నిజాం పతనాన్ని శాసించిన కమ్యూనిస్టులనే ఊచకోత కోసాయి. ఆ పోరాటంలో అమరులైన 4000 మంది యోధులలో అత్యధికులను వీరే హతమార్చారు. వేలాది మందిని జైళ్లలో పెట్టి చిత్రహింసలు పెట్టారు. సాయుధపోరాటంలో ఉన్న ఓ వ్యక్తిని జైల్లో పెట్టి అరికాల్లలో, గోళ్లలో సూదులు గుచ్చి చిత్రహింసలు పెట్టారు. అయినా తమ వాళ్ల అచూకి చెప్పలేదు. అప్పటి శారీరక గాయాలు ఆయనను జీవితాంతం బాధ పెట్టాయి.. బురద పొలం దుంతే… పాదాలు నాని సూదులు కుచ్చిన చోట పుండ్లుం పడేవి. ఆ వ్యక్తి మా తాత కావడంతో గాయాలతో ఆయన పడ్డ బాధను దగ్గరగా చూశాను. అది తలుచు కుంటేనే మనసు తల్లడిల్లితే… అనుభవించిన వారి గురించే ఏమి చెప్పాలి. ఇలా మా తాత ఒక్కరే కాదు వేలాది మంది ఆ చిత్రహింసలు అనుభవించారు.
నాటి వీరుల పోరాటంతో స్వేచ్ఛ పొంది రాజాకీయాలు వెలగపెడుతున్న కొందరు… నిజాం పాలన అంతమైన దినం.. విలీన దినం… వీమోచన దినం అని ఎవరి ప్రయోజనాలకు అనుగుణంగా వారు ప్రకటిస్తున్నారు. తెలంగాణ వాదంతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ రోజును అధికరికంగా జరపకపోవడం బాధకరమే కాదు.. నాటి వారి త్యాగాన్ని అవమానించటమే.
ఇక నైన ఓటు బ్యాంకు రాజకీయాలు మాని ఈ రోజును వివాదస్పదం చేయ్యోదని నా మనవి.
వీర తెలంగాణా విప్లవ పోరాట వార్షికోత్సవం జరుపుకుందాం. అమరులకు జోహార్లు అర్పిద్దాం.

– ఓ జర్నలిస్టు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *