వెరైటీ పెళ్లి సంప్రదాయాలు
నో బాత్‌రూం.. కొత్తజంటలను రూంలో పెట్టి తాళం
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ మధురానుభూతిని జీవితాంతం గుర్తుంచుకునేలా ఏర్పాట్లు చేసుకుంటారు. వివిధ దేశాల్లో విభిన్న రీతిలో పెళ్లి చేసుకునే సంప్రదాయాలు ఉంటాయి. కులాలు, మతాలు, ప్రాంతాలు, తెగలవారీగా పెళ్లి వేడుకల్లో వైవిధ్యం స్పష్టంగా కనిపిస్తుంది. మన దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కోలా పెళ్లి వేడుకలు ఉంటాయి. మన దేశ సంప్రదాయాల గురించి ప్రజలకు చాలావరకు అవగాహన ఉంటుంది. కానీ కొన్ని దేశాల్లో కూడా పెళ్లికి ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. ఈ వేడుకలకు సంబంధించి వివిధ దేశాల్లో కొన్ని ఆసక్తికరమైన సంప్రదాయాలు ఉన్నాయి. వీటిపై ఓ లుక్కేద్దామా..
భారత్
మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో పెళ్లి రోజున పెళ్లికూతురు చెల్లెళ్లు వరుడి చెప్పులను, ఇతర వస్తువులను దాచిపెట్టే సంప్రదాయం ఉంది. అతడికి చెప్పులను తిరిగి ఇవ్వడానికి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తారు. ఈ సమయంలో బావను వారు ఆటపట్టిస్తారు. ఈ వేడుకను జూటా చుపాయి అంటారు. రెండు కుటుంబాల బంధాలను బలోపేతం చేసుకోవడానికి ఇది మంచి మార్గమని ప్రజలు భావిస్తారు. ఇలాంటి ఘటనలు పెళ్లిలో వినోదాన్ని పంచుతాయి.
నార్వే
నార్వేలో పెళ్లి రోజున ప్రత్యేకంగా తయారు చేసిన టవరింగ్ కేకును వడ్డిస్తారు. దీనిని ఆల్మండ్ ఐస్ కేకు రింగులతో, ఒక కోన్ ఆకారంలో తయారుచేస్తారు. ఈ కేకు మధ్యభాగంలో ఒక వైన్ బాటిల్ ఉంటుంది. వధూవరులతోపాటు పెళ్లికి వచ్చినవారు ఆ వైన్ తాగుతూ కేక్ తినవచ్చు.
ఇండోనేషియా
ఈ దేశంలోని బోర్నియోలో, పెళ్లి తరువాత వధూవరులను మూడు రోజులపాటు ఒకే గదిలో ఉంచుతారు. ఈ సమయంలో వారు బాత్‌రూంకు వెళ్లేందుకు వీలుండదు. ఇలా చేయడం వల్ల నవ దంపతుల మధ్య బంధం బలపడుతుందని అక్కడి ప్రజలు నమ్ముతారు. దీనివల్ల వారి మూత్రాశయం కూడా బలోపేతం అవుతుందని వారు చెబుతారు.
గ్రీస్
గ్రీస్ దేశంలో పెళ్లికి ముందు వధువు బంధుమిత్రులు వరుడికి షేవింగ్ చేస్తారు. షేవింగ్ చేసిన తరువాత, తన అత్త అతడికి తేనె, బాదం కలిపి తినిపించాలి.
జపాన్
జపాన్ అమ్మాయిలు పెళ్లిరోజున షింటో వేడుకను జరుపుకుంటారు. ఆ రోజు వారు తల నుంచి కాళ్ల వరకు తెలుపు రంగు దుస్తులను ధరిస్తారు. ఆమె మేకప్ కూడా వైట్ కలర్లోనే ఉండాలి. ఆ డ్రెస్‌కు తలను కప్పే హుడ్ ఉంటుంది. దీనిని ‘త్సునోకుషి’ అంటారు. తెలుపు రంగు వధువు కన్యత్వాన్ని సూచిస్తుంది. దుస్తులకు ఉండే హుడ్, కాబోయే అత్తగారిపై అసూయ అనే కొమ్ములను పెరగనీయకుండా చూస్తుందని నమ్ముతారు.
ఫిజీ
ఫిజీలో వరుడు, తనకు కాబోయే మామగారి వద్దకు వెళ్లి, తన కూతురిని ఇచ్చి పెళ్లిచేయమని అడగాలి. అలా అడిగినప్పుడు అతడు కాబోయే మామగారికి ఒక తిమింగలం దంతాన్ని కానుకగా ఇవ్వాలి.
జర్మనీ
జర్మన్ వధూవరులు పెళ్లి తరువాత, అతిధులు తిని పడేసిన ప్లేట్లను కడిగి, వాటిని శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల దుష్ట శక్తులను నిరోధించవచ్చని అక్కడి ప్రజలు భావిస్తారు.
చెక్ రిపబ్లిక్
ఈ దేశంలో వధూవరుల మంచంపై ఒక శిశువును ఉంచడం ఆచారం. పెళ్లి అయిన తరువాత, అతిధులు వారికి పప్పుధాన్యాలు, బియ్యం, బఠానీలతో స్నానం చేయిస్తారు. ఇలాంటి పద్ధతులు సంతానోత్పత్తిని ప్రోత్సహిస్తాయని నమ్ముతారు.
గ్వాటెమాల
గ్వాటెమాలలో పెళ్లి తరువాత బియ్యం, ఇతర ధాన్యాలు, పిండితో ఉన్న ఒక సిరామిక్ బెల్‌ను పగలగొట్టమని వరుడిని అతడి తల్లి ఆదేశిస్తుంది. ఇవి వధూవరులకు సౌభాగ్యాన్ని తీసుకువస్తాయని నమ్మకం.
ఫ్రాన్స్
ఫ్రాన్స్ లో పెళ్లి రిసెప్షన్ తరువాత వధూవరులు షాంపైన్, చాక్లెట్లను టాయిలెట్ బౌల్‌లో తినాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మొదటి రాత్రికి ముందు వారిద్దరి మధ్య బంధం బలోపేతమవుతుందని భావిస్తారు. కానీ ఈ ఆచారం ఇప్పుడు పెద్దగా కనిపించట్లేదు.