వ్యాక్సిన్ రెండు డోసులు తప్పనిసరి..లేదంటే..
కరోనా కల్లోలం సృష్టిస్తోన్న వేళ దాన్ని నివారించేందుకు వ్యాక్సిన్ మాత్రమే ఆయుధంగా మారింది. అంతేకాదు ఈ వ్యాక్సిన్ ఒక డోసు వేయించుకోవడం వల్ల ఏం లాభం లేదట. తప్పనిసరిగా రెండు డోసులు వేయించుకుంటేనే మనం దాని బారినుండి తప్పించుకోవచ్చట.. కరోనా వైరస్ డెల్టా వేరియంట్ రోగ నిరోధక వ్యవస్ధను బోల్తా కొట్టిస్తుందని వ్యాక్సిన్ రెండు డోసులతోనే రోగి ఆస్పత్రిపాలు కాకుండా నివారించవచ్చని నేచర్ జర్నల్లో ప్రచురితమైన తాజా అధ్యయనం వెల్లడించింది. ఒక డోసుతో డెల్టా నుంచి రక్షణ లభించదని, కరోనా నుంచి కోలుకున్నవారు కొన్ని వేరియంట్ల నుంచి రక్షణ పొందేందుకు వ్యాక్సిన్ రెండు డోసులూ తీసుకోవాలని అధ్యయనం సూచించింది.
అల్ఫా కంటే డెల్టా వేరియంట్ 60 శాతం అధికంగా వ్యాప్తి చెందుతోందని మలేషియా, పోర్చుగల్, ఇండోనేషియా, ఆస్ట్రేలియాల్లో వ్యాక్సిన్ తీసుకోని జనాభాలో బాగా వ్యాపిస్తోంది. ఫ్రెంచ్ పరిశోధకులు 103 మంది నుంచి సేకరించిన రక్త నమూనాలను పరిశీలించగా పలు వివరాలు వెల్లడయ్యాయి. అమెరికా, జర్మనీలో డెల్టా కేసులు ప్రబలంగా వెలుగుచూస్తుండగా అమెరికాలో 48 శాతం జనాభాకు పూర్తిగా వ్యాక్సినేషన్ అందుబాటులోకి రావడంతో అక్కడ కేసులు పెరుగుతున్నా రోగులు ఆస్పత్రిపాలు కావడం, మరణాల రేటు తక్కువగా ఉన్నట్టు వెల్లడైంది. అమెరికాలో ఇప్పటికే 55 శాతం జనాభా కనీసం వ్యాక్సిన్ సింగిల్ డోసు తీసుకున్నారు. ఇక కొవిషీల్డ్ (ఆస్ట్రాజెనెకా), ఫైజర్ వ్యాక్సిన్ సింగిల్ డోసు తీసుకున్నవారిలో కేవలం పదిశాతం మందిలోనే డెల్టా, బీటా వేరియంట్లను యాంటీబాడీలు తటస్ధీకరిస్తున్నట్టు ఈ అధ్యయనంలో గుర్తించారు. రెండవ డోసు కూడా తీసుకున్నవారు 95 శాతం మంది వరకూ ఈ వేరియంట్ల ప్రభావానికి లోను కావడం లేదని వెల్లడైంది.