వ్యోమగాములు హైట్ పెరుగుతారట..ఎందుకో తెలుసా..!

ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు..విడ్డూరాలు..వాటిని చూసేందుకు పలువురు యాత్రల పేరుతో ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్లుతూ వుంటారు..మనం కూడా మనకి నచ్చిన ప్లేస్ లని చూసేందుకు టూర్ ప్లాన్ చేసుకుంటుంటాం..అలానే ఇప్పుడు ఈ పర్యటన అనేది అంతరిక్షం వరకు పాకింది. లోక‌ల్ ట్రిప్‌.. నేష‌న‌ల్ ట్రిప్.. ఫారిన్ ట్రిప్‌ల‌తోపాటు ఇప్పుడు స్పేస్ ట్రిప్ అనే న‌యా ట్రెండ్ మొద‌లైంది. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ స్పేస్ ట్రిప్పే అందుకు ఉదాహ‌ర‌ణ‌. ప్ర‌స్తుతానికైతే బిలియ‌నీర్లు, స్పేస్ టెక్నాల‌జీపై అవగాహ‌న ఉన్నవారు మాత్ర‌మే అంత‌రిక్షంలోకి వెళ్ల‌గ‌లుగుతున్నారు. భ‌విష్య‌త్తులో సామాన్యులు సైతం టికెట్లు కొనుగోలు చేసి అంత‌రిక్షంలో ప‌ర్య‌టించే రోజులు వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు.ఈ క్ర‌మంలోనే అంత‌రిక్షంలో మ‌న శ‌రీరం ఎలాంటి మార్పుల‌కు లోన‌వుతుంది.. అనే దానిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. వాస్త‌వానికి.. భూమిపై ఉండే వాతావ‌ర‌ణానికి, రోదసి వాతావ‌ర‌ణానికి చాలా తేడా ఉంటుంది. రోద‌సిలో వ్యోమ‌గాములు కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో ఉంటారు. దానివ‌ల్ల వారి శ‌రీరంలో కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. మ‌రి అవి ఎలాంటి మార్పులో మ‌నం కూడా తెలుసుకుందాం..అంత‌రిక్షంలో ఎక్కువ‌సేపు ఉంటే వ్యోమ‌గాములు ఎందుకు ఎత్తు పెరుగుతారు..? వ్యోమ‌గాములు ఎత్తు పెరుగుతార‌నే విష‌యం విన్న ఎవ‌రికైనా ఇది స‌హ‌జంగా త‌లెత్తే ప్ర‌శ్న‌. అయితే, ఈ ప్ర‌శ్న‌కు నిపుణులు ఏం స‌మాధానం చెబుతున్నారంటే.. అంత‌రిక్షంలో వ్యోమ‌గాములు పూర్తి భార ర‌హిత స్థితికి చేరుకుంటారు. భూమ్యాక‌ర్ష‌ణ శ‌క్తి లేని కార‌ణంగా ఆధారంపై నిల‌బ‌డ‌లేక‌పోతారు. గాల్లో తేలియాడుతుంటారు. ఫలితంగా శ‌రీరం కొద్దికొద్దిగా సాగిపోతుంటుంది. విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉన్నా ఇది నిజం.ఉదాహ‌ర‌ణ‌కు ఒక వ్యోమగామి 6 అడుగుల పొడవు (1.8 మీటర్లు) ఉంటే.. అతను లేదా ఆమె కక్ష్యలో ఉన్నప్పుడు రెండు అంగుళాలు (5 సెంటీమీటర్లు) పొడ‌వు పెరుగుతార‌ని అమెరికాలోని సైన్స్ మ్యాగ‌జైన్ సైంటిఫిక్ అమెరికన్ తెలిపింది. అయితే వారు భూమికి తిరిగి వ‌చ్చిన త‌ర్వాత క్ర‌మంగా సాధార‌ణ ఎత్తుకు మారిపోతార‌ట‌. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో దాదాపు ఏడాది ఉన్న నాసా వ్యోమగామి స్కాట్ కెల్లీ తన కవల సోదరుడు మార్క్ కంటే రెండు అంగుళాల పొడవు పెరిగాడ‌ట‌.నిపుణులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. అంత‌రిక్షంలో ఉన్న‌పుడు వ్యోమ‌గాముల శ‌రీరంలో అనేక మార్పులు జ‌రుగుతాయి. వారు భార‌ర‌హిత స్థితిలో గాల్లో తేలడం కార‌ణంగా.. కాళ్లలోని ఎముక‌లు, వెన్నెముకపై శ‌రీరబ‌రువు ప‌డదు. దాంతో కాల్షియం విడుద‌ల‌పై ప్ర‌భావంప‌డి ఎముక‌లు పెలుసుగా, విరిగే స్థితికి చేరుతాయి. అలాగే వ్యోమ‌గాముల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్ప‌డ‌తాయి. ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ర‌క్తప్ర‌స‌ర‌ణ ఎక్కువ‌గా శ‌రీరంలోని పైభాగాల‌కే చేరుతుంది. అందుకే అంత‌రిక్షంలో వ్యోమ‌గాములు మొహం వాచిపోయిన‌ట్లు, కాళ్లు ప‌లుచ‌బారిన‌ట్లు క‌నిపిస్తాయి.ఇక గుండె ప‌రిమాణం, చెవిలోని ద్ర‌వాల స‌మ‌తుల్య‌తలో కూడా స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయి. అంత‌రిక్షంలో ఎక్కువ రేడియో ధార్మిక‌తవ‌ల్ల‌ వ్యోమ‌గాములు కాన్స‌ర్‌లాంటి వ్యాధుల బారినప‌డే ప్ర‌మాదం కూడా ఉంది. అయితే వ్యోమ‌గాములు భూమిపైకి తిరిగొచ్చాక వారు సాధార‌ణ‌స్థితికి చేర‌డానికి త‌గిన ఏర్పాట్లు చేస్తారు. మ‌న‌లాగానే న‌డ‌వడానికి, హ‌గ్ చేసుకోవ‌డానికి, ప‌రుగెత్త‌డానికి వీలుగా శ‌రీరాన్ని స‌మ‌న్వ‌య ప‌రుచుకోవ‌డానికి వారికి కొంత స‌మ‌యం ప‌డుతుంది.అంత‌రిక్ష యాత్ర‌ దిగ్విజ‌యంగా పూర్తి చేసుకున్న ప్ర‌పంచ‌ కుబేరుడు, అమెజాన్ వ్య‌వ‌స్థాప‌కుడు జెఫ్ బెజోస్‌, అత‌నితోపాటు నింగికెగిసిన రిచ‌ర్డ్ బ్రాన్స‌న్ కూడా ఎత్తు పెరిగారా అంటే లేదు అనే చెప్పాలి. ఎందుకంటే వారు చేసిన యాత్ర చాలా చిన్న‌ది. కేవ‌లం కొన్ని నిమిషాల‌లో ముగిసిన యాత్ర అది. వెన్నెముక‌లు సాగేంత‌సేపు వారు అక్క‌డ ఉండ‌లేదు. అందుకే వారి ఎత్తుల్లో ఎలాంటి మార్పులు రాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *