శరీరంలో 8నెలలపాటు యాంటీబాడీలు..
ప్రస్తుతం వైద్య పరిశోధకులు కరోనాపై అధ్యయనాలు తెగ చేస్తున్నారు..కరోనా తీవ్రత..దాని లక్షణాలు ఇలా పలు అంశాలపై శోధిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో విషయాలు కనిపెట్టారు కూడా ..కాగా కరోనా సోకి కోలుకున్న వారిలో యాంటీబాడీలు (ప్రతిరక్షకాలు) ఉంటాయన్న విషయం తెలిసిందే. మరోసారి కరోనా బారిన పడకుండా అవి కాపాడతాయి. అయితే, కరోనా నుంచి కోలుకున్న అనంతరం అవి ఎంత కాలం ఉంటాయన్న విషయంపై అధ్యయనాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అవి కనీసం ఎనిమిది నెలల పాటు ఉంటాయని ఇటలీ శాస్త్రవేత్తలు తాజాగా పేర్కొన్నారు. అంతేకాదు, ఇన్ఫెక్షన్ తీవ్రతతో పాటు కరోనా సోకిన వారి వయసు, వారికి ఉండే ఇతర అనారోగ్య సమస్యలు వంటి అంశాలతో సంబంధం లేకుండా యాంటీబాడీలు ఉంటాయని చెప్పారు. 162 మంది కరోనా బాధితులపై పరిశోధన జరిపిన అనంతరం ఇటలీ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారు. గత ఏడాది మార్చి, ఏప్రిల్లో కరోనా నుంచి కోలుకున్న వారి నుంచి రక్త నమూనాలు సేకరించి ఈ అధ్యయనం చేశారు. అనంతరం నవంబరు నెలాఖరులో మరోసారి నమూనాలు తీసుకున్నారు. ఆయా వ్యక్తులలో యాంటీబాడీలు మెల్లిగా తగ్గుతాయని, అయినప్పటికీ కరోనా సోకిన ఎనిమిది నెలల తర్వాత కూడా శరీరంలో వాటి ఉనికి ఉందని చెప్పారు. తాము పరిశోధనలు చేసిన వారిలో ఎనిమిది నెలల తర్వాత ముగ్గురిలో మాత్రమే యాంటీబాడీలు లేవని వివరించారు.