శున‌కాలతో జ‌ర భ‌ద్రం..నాకిందో ప్రాణ హాని..

చాలా మందికి పెంపుడు జంతువులంటే ఇష్టం..అంత‌కు మించి ప్రాణ‌మ‌నే చెప్పాలి. కుక్క‌లంటే మ‌నిషికంటే విశ్వాసంగా ఉంటాయ‌ని తెలిసిందే. అయితే ఇప్పుడో షాకింగ్ న్యూస్ బ‌య‌టికి వ‌చ్చింది. గతంలో తన పెంపుడు కుక్క ఓ వ్య‌క్తి నాకడంతో ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ సోకి జర్మనీకి చెందిన ఓ వ్యక్తి చనిపోయారు. ఇదే విషయాన్ని ‘యూరోపియన్ జర్నల్ ఆఫ్ కేస్ రిపోర్ట్స్ ఇన్ ఇంటర్నల్ మెడిసిన్‌’ వెల్లడించింది. కుక్కలు, పిల్లుల లాలాజలంలో క్యాప్నోసైటోఫాగా కానిమోర్సస్ అనే బ్యాక్టీరియా ఉంటుందట. కుక్క, పిల్లి కరవడం వల్ల ఆ బ్యాక్టీరియా సోకిన కేసులు అప్పుడప్పుడూ వెలుగులోకి వస్తుంటాయి కూడా. కానీ, జర్మనీకి చెందిన ఓ 63 ఏళ్ల వ్యక్తి కుక్క కరవకున్నా ఆ బ్యాక్టీరియా సోకి చనిపోయారు. మూడు రోజుల పాటు తీవ్రమైన జ్వరం, కండరాల నొప్పులతో బాధపడిన తర్వాత ఆయన ఆస్పత్రిలో చికిత్సపొందారు. ఆయన ముఖం, చేతుల మీద బొబ్బలు, ఎర్రని మచ్చలు వచ్చాయి. శరీరం లోపల కూడా అనేక అవయవాలు దెబ్బతిన్నాయి. కాలేయం పనిచేయడం ఆగిపోయిందట, అదికాస్తా కార్డియాక్ అరెస్ట్‌కు దారితీసింది. దాంతో, ఆస్పత్రిలో చేరిన తర్వాత 16 రోజులకు ఆయన మరణించారు.

అయితే కొన్ని వారాల కింద ఆయనను పెంపుడు కుక్క నాకింది కానీ ఎలాంటి గాయం చేయలేదని జర్నల్‌లో పేర్కొన్నారు. దీనిని బట్టి, కుక్కలు, పిల్లులు నాకినా కొన్నిసార్లు ప్రమాదకరంగా మారొచ్చని తేలింది.కొన్నిసార్లు కుక్క కరవకపోయినా, గాయాలున్న చోట అది నాకితే దాని లాలాజలంలోని బ్యాక్టీరియా మనకు సంక్రమించవచ్చే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే, ఈ బ్యాక్టీరియా ప్రాణాంతకంగా మారిన కేసులు తక్కువే కానీ, రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారి మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైద్యులు అంటున్నారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్‌తో బాధపడేవారిలో దాదాపు 30 శాతం మంది చనిపోయే అవకాశం ఉందని సీడీసీ తెలిపింది. గుండె పోటు, మూత్రపిండాలు పనిచేయకపోవడం, గ్యాంగ్రీన్ అంటే రక్తసరఫరా ఆగిపోయి కణాలు చనిపోవడం లాంటి తీవ్రమైన సమస్యలకు కూడా దారితీసే ప్రమాదం ఉంటుందని వెల్లడించారు. ఎక్కువగా 40 ఏళ్లకు పైబడిన వారికి ఈ బ్యాక్టీరియా సోకుతుందని, కొన్ని కేసుల్లో చిన్న పిల్లలు కూడా ఉంటున్నారని, గర్భిణుల మీద కూడా దీని ప్రభావం అధికంగా ఉండొచ్చని సీడీసీ పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *