సామాన్యుడిపై పెట్రో భారం..
పెరుగుట విరుగుటకే అనేది నానుడి.. నిజమే దేశంలో వరుసగా నాలుగో రోజు కూడా చమురు ధరలు పెరిగాయి. దీంతో సామాన్యుడి నడ్డి విరుగుతున్నది. శుక్రవారం పెట్రోల్, డీజిల్‌పై 39 పైసల చొప్పున పెంచుతున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. ఢిల్లీలో పెట్రోల్ లీటరుకు రూ.88.14, డీజిల్ రూ.78.38కి చేరింది. ముంబైలో లీటరు పెట్రోలు ధర రూ.రూ.94.64, డీజిల్ రూ.85.32 గా ఉంది. బెంగళూరులో లీటరు పెట్రోలు రూ.91.09, డీజిల్ రూ.83.09, జైపూర్‌లో పెట్రోల్ ధర రూ.94.81, డీజిల్ ధర రూ.86.89, పాట్నాలో లీటరు పెట్రోలు రూ.90.86, డీజిల్ రూ.83.87 గా ఉంది. విజయవాడలో లీటరు పెట్రోల్ ధర రూ.94.25కి, లీటరు డీజిల్ ధర రూ.87.59కి పెరిగింది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.91.65కి చేరింది. డీజిల్ ధర లీటరుకు రూ.85.50కి పెరిగింది. ఈ పెంపు సామాన్య జీవికి భారంగా మారుతున్నది. పెట్రో ధర పెంపుతో ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతుండటంతో ప్రజల జీవనం కష్టంగా మారుతున్నది. పెరిగిన ధరలకు అనుగుణంగా ఆదాయం పెరగకపోవడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.