స్నేక్ హెడ్ చేప..అమెరికాని వణికిస్తోందట..

అమెరికాని గడ గడలాడిస్తోందట ఓ రకం చేప..చేపకి భయపడటం ఏంటీ అనుకుంటున్నారా..అయితే వివరాల్లోకి వెళ్దాం.. నార్తర్న్ స్నేక్‌హెడ్ చేప (చనా ఆర్గస్) మన దేశంలో లభ్యమయ్యే కొరమీను జాతికి చెందిన చేప.ఇది పొడవుగా సన్నగా ఉంటుంది. కానీ దీని తల చిత్రంగా బల్లపరుపుగా ఉంటుంది. దీనికి ఆకలి ఎక్కువ. ఇతర జీవులను వేటాడి తింటుంది.వేరే చేపలు, కప్పలు, పీతలు తమ దగ్గర్లో ఏదున్నా ఈ స్నేక్‌హెడ్ చేపలు వేటాడి తినేస్తాయి.ఇవి దాదాపు 80 సెంటీమీటర్ల వరకూ పొడవు పెరుగుతాయి. నీటి వెలుపల కూడా శ్వాస తీసుకోవటమే కాదు.. ‘నడవగలిగే’ సామర్థ్యం కూడా వీటికి ఉంది.ఈ సామర్థ్యంతో ఇవి ఒక నీటి ఆవాసం నుంచి వేరొక నీటి ఆవాసానికి సులభంగా వెళ్లిపోతుంటాయి.ఈ స్నేక్‌హెడ్ ఫిష్ ఎక్కడికైనా ఒకసారి వచ్చిందంటే దానితో పోరాడటం చాలా కష్టం. ఆడ చేపలు ఏటా 10,000 గుడ్ల వరకూ పెడతాయి.నిజానికి ఈ స్నేక్‌హెడ్ చేపలు చైనా, రష్యా, కొరియా ద్వీపకల్పాల్లో ఉంటాయి. దాదాపు దశాబ్దం కిందట ఈ చేప మొదటిసారి అమెరికాలో కనిపించింది.ఇప్పటివరకూ నాలుగు జాతుల స్నేక్‌హెడ్ చేపలను అమెరికాలో గుర్తించారు.ఈ స్నేక్‌హెడ్ చేపలను ఇంట్లో పెంచుకోవటానికి తీసుకువచ్చిన వారు.. ఉద్దేశపూర్వకంగా వాటిని జలమార్గాల్లో వదిలిపెట్టటం వల్ల వీటి దండయాత్ర మొదలైందని భావిస్తున్నట్లు అమెరికా అధికారులు చెప్తున్నారు.ఫ్లోరిడా, న్యూయార్క్, వర్జీనియా, కాలిఫోర్నియా, మసాచుసెట్స్, మేరీల్యాండ్ తదితర రాష్ట్రాల్లోనూ ప్రకృతి సహజసిద్ధమైన ప్రాంతాల్లో ఈ స్నేక్‌హెడ్స్ కనిపించాయి.మొదట మేరీల్యాండ్ రాష్ట్రంలో 2002లో దీనిని గుర్తించారు. అయితే అప్పుడు పిల్లచేపలు కనిపించటంతో ప్రకృతిలో ఈ చేపలు పునరుత్పత్తి చేయగలుగుతున్నాయని వెల్లడైంది. దీంతో ఆందోళన పెరిగింది.జార్జియా రాష్ట్రంలో తొలిసారి ఒక స్నేక్‌హెడ్‌ చేపను పట్టుకున్నట్లు నిర్ధారించిన తర్వాత.. అక్టోబర్ 8వ తేదీన అధికారులు బహిరంగ హెచ్చరిక జారీ చేశారు.ఈ చేప నీటి వెలుపల కూడా బతకగలదని గుర్తుంచుకోవాలని ప్రజలకు సహజ వనరుల శాఖ సూచించింది. ఈ చేపను పట్టుకున్నపుడు దాని ఫొటో తీయటంతో పాటు.. దానిని ఎక్కడ పట్టుకున్నారనే వివరాలూ నమోదు చేయాలని నిర్దేశించింది.ఇది పెద్ద ప్రయత్నమే. కానీ ఇవి దొరికిన ప్రాంతాల్లో గాలించటం ద్వారా వీటిని పట్టుకుని.. వీటి సంఖ్య పెరగకుండా చేయాలని ప్రయత్నిస్తున్నాం” అని జార్జియా సహజ వనరుల శాఖ ఫిషింగ్ ఆపరేషన్స్ మేనేజర్ స్కాట్ రాబిన్సన్ పేర్కొన్నారు.ఈ స్నేక్‌హెడ్ చేప నీరు లేని నేల మీద బతకటానికి ఉపయోగించే వ్యవస్థ గురించి బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్‌లో ఎవల్యూషనరీ ఎకాలజీ అండ్ ఆక్విటిక్ బయాలజీ ప్రొఫెసర్‌ మార్టిన్ జెన్నర్ బీబీసీకి వివరించారు.ఈ చేపలు ఆసియాలోని సహజ ఆవాసాల్లో.. వరి మడులు, అటవీ బురద ప్రాంతాలు వంటి ఆక్సిజన్ తక్కువగా ఉండే బురద ప్రదేశాలను ఆవాసంగా చేసుకుంటాయి అని ఆయన తెలిపారు. ఆ ప్రాంతాల్లో నివసించే చేపలు మనుగడ సాగించటానికి వివిధ రకాలుగా పరిణమించాయి. ప్రాథమికంగా.. ఆ వాతావరణాల్లో తాము పీల్చుకునే ఆక్సిజన్‌ను గరిష్ఠంగా పెంచుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి అని పేర్కొన్నారు.స్నేక్‌హెడ్స్ కనిపించిన జలాల్లోకి వెళ్లి వచ్చిన వారిని.. ”ఆ నీటితో తడిసిన ప్రతిదాన్నీ.. దుస్తులు, కుక్కలు, పరికరాలు, బోట్లు వంటివాటినన్నిటినీ శుభ్రంచేసి ఎండబెట్టాల”ని జార్జియా అధికారులు ప్రజలకు సూచించటం వెనుక కారణం.. జాతి మనుగడ కోసం స్నేక్‌హెడ్స్ చాలా తీవ్రంగా ప్రయత్నించటమే.ఈ జాతి చేపల భీకర ఆకలి వల్ల.. ఇతర జాతులకు ఆహార లభ్యత మీద కూడా తీవ్ర ప్రభావం చూపగలదు.నీటి లోపల తక్కువ ఆక్సిజన్‌తోనే మనుగడ సాగించగల సామర్థ్యం వల్ల.. జీవించటానికి ఎక్కువ ఆక్సిజన్ అవసరమైన ట్రౌట్, బాస్ వంటి ఇతర జాతుల చేపల మీద స్నేక్‌హెడ్స్‌కు పైచేయి లభిస్తుంది.అందువల్లే ఈ చేప జాతులు భీతిగొలిపే ఖ్యాతి గడించాయి. వీటి మీద ప్రత్యేకంగా నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీ కూడా రూపొందింది.ఆ డాక్యుమెంటరీకి ”ఫిష్‌జిల్లా” అని టైటిల్ పెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *