స‌రస్సు అడుగున గ్రామం..అస‌లేం జ‌రిగింది..!

ఓ స‌ర‌స్సు అడుగున బ‌య‌ట‌ప‌డిందో గ్రామం..ఆ వివ‌రాలు చూద్దాం.. ఇటలీలోని ఒక రిజర్వాయర్​‌ అడుగున ఇవి కనిపించాయి. ఉత్తరాన ఉండే రేసియా సరస్సు, దాని మధ్యలో ఉండే చర్చి టవర్ చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి.ఆ పరిసరాలు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. ఒక పుస్తకం రాసేందుకు, నెట్​ఫ్లిక్స్​లో ఒక సిరీస్​ను నిర్మించేందుకు కూడా ఈ సుందర దృశ్యం ప్రేరణగా నిలిచింది.రిజర్వాయర్​‌‌ మరమ్మత్తుల కోసం సరస్సులోని నీటిని వదిలేయడంతో క్యురన్​ అనే గ్రామం ఆనవాళ్లు కనిపించాయి.ఒకప్పుడు ఈ గ్రామంలో వందలాది మంది నివసించేవారు.1950లో హైడ్రోఎలక్ట్రిక్​ ప్లాంట్​ను నిర్మించడం వల్ల వరద నీరు చేరి క్యురన్​ గ్రామం నీట మునిగింది.సరస్సు అడుగున ఉన్న 14వ శతాబ్దానికి చెందిన చర్చి టవర్​తో పాటు గోడలు, సెల్లార్లు, మెట్ల ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి. ఒకప్పటి గ్రామం నడిబొడ్డున నడుస్తున్నప్పుడు ‘వింత అనుభూతి’ కలిగిందని లూసియా అజోలినీ అనే వ్యక్తి ట్వీట్ చేశారు.1950లో ఒక రిజర్వాయర్​ను నిర్మించాలని, దగ్గర్లోని రెండు సరస్సులను కలపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో ప్రజలకు ఇష్టం లేకపోయినా క్యురన్​ గ్రామం నీట మునగాల్సిన పరిస్థితి వచ్చింది.దాదాపు 160 ఇళ్లు నీట మునిగాయి. క్యురన్ ప్రజలు నిర్వాసితులయ్యారు. కొందరు కొత్తగా నిర్మించిన గ్రామంలో స్ధిరపడ్డారు.రేసియా లేదా జర్మన్​లో రెస్​చెన్​సీ అని పిలిచే ఈ సరస్సు ఆస్ట్రియా, స్విట్జర్లాండ్​ సరిహద్దుల్లో పర్వత ప్రాంతంలోని దక్షిణ టైరోల్​లో ఉంది. ప్రస్తుతం వేసవి కాలంలో సరస్సు వద్దకు హైకర్స్ వస్తుంటారు. చలికాలంలో యాత్రికులు గడ్డ కట్టిన సరస్సుపై నడుస్తూ శిఖరాన్ని చేరుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *