13 ఏళ్లకే మందు, సిగరెట్.. సర్వేలో వెల్లడి?
మద్యం తాగడం అంటే ఒకప్పుడు కేవలం పెద్దవాళ్ళకు మాత్రమే పరిమితమై ఉండేది. ప్రస్తుతం చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మద్యానికి బానిసగా మారిపోతున్నారు. అభం శుభం తెలియని వయసులోనే చెడు అలవాట్లకు బానిసగా మారుతున్న ఎంతో మంది చిన్నారులు జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నారు. లోకం తెలియని వయసులోనే మద్యపానం, ధూమపానం అంటూ వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. ఇలా చిన్నపిల్లలే చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు అన్న విషయాన్ని ఇప్పటికే పలు సర్వేలు కూడా చెప్పాయి. 21 ఏళ్లు నిండినవారికి మాత్రమే మద్యం విక్రయించాలి అనే నిబంధన ప్రతి మద్యం దుకాణం ముందు, పెట్టినప్పటికీ.. మద్యపానం, ధూమపానం ద్వారా ఆరోగ్యానికి హానికరం అని ఎప్పటికప్పుడు అవగాహన చర్యలు చేపట్టినప్పటికీ యువత పట్టించుకోకపోవడం గమనార్హం. ఇక ఇటీవలే ఐసీఎంఆర్ నిర్వహించిన సర్వేలో మరో ఆసక్తికర విషయం తేలింది. దేశంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యువత యుక్త వయసులో ఎలాంటి చెడు పోకడలు పోతూ ఉన్నారు అన్నది ఈ సర్వే చెప్తున్నది.
దేశంలో యుక్తవయసు మొదలయ్యే క్రమంలోనే యువత చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నట్లు ఇటీవలే ఐసీఎంఆర్ సర్వే నివేదిక పేర్కొన్నది. పట్టణాల్లో 15.1 ఏళ్ల వయస్సులో మద్యపానం, ధూమపానానికి అలవాటు అవుతూ ఉంటే.. గ్రామాల్లో మాత్రం 13.9 ఏళ్లకే యువత చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నట్లు తేలింది. గ్రామాలతో పోలిస్తే పట్టణాలలో యువత శారీరక శ్రమ తక్కువగా ఉంది అని నివేదించింది. ఇలా చిన్న వయసులోనే ఎంతో మంది బాలబాలికలు చెడు వ్యసనాల బారిన పడుతూ జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నారు అని ఐసీఎమ్ఆర్ సర్వే వెల్లడించింది.