130ఏండ్లకు మించి బతకొచ్చట..

నేటి ఒడిదుడుకుల ప్రపంచంలో ..కరోనా లాంటి..వ్యాధులతో ఎన్ని రోజులు బతుకుతామో..తెలియని పరిస్థితి..అయితే ఈ శతాబ్దం చివరినాటికల్లా అంటే 2100 ఏడాదినాటికి మనిషి 130 ఏండ్లకు మించి బతుకవచ్చని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ పరిశోధకులు ఒక అధ్యయనంలో అంచనా వేశారు. రోగాలబారిన పడకుండా ఆరోగ్యవంతమైన జీవనశైలిని పాటించడం, మానసికంగా ప్రశాంతంగా ఉండటం, సానుకూల దృక్పథం, బతుకాలన్న స్థెర్యం, శాస్త్ర విజ్ఞానంలో కొత్త ఆవిష్కరణలు.. ఇవే మనిషిని ఎక్కువ కాలం జీవించేందుకు దోహదం చేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వివరాలు ‘డెమోగ్రాఫిక్‌ రిసెర్చ్‌’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. అమరత్వం సాధించేందుకు తపస్సులు, యజ్ఞయాగాదులు జరిగినట్టు పురాణేతిహాసాల్లో చదువుకున్నాం. జీవికి మరణాన్ని దూరంచేసే సంజీవని ఔషధం, అమృతభాండాగారం వంటి కథలనూ విన్నాం. అవన్నీ పక్కనబెడితే.. ఆధునిక జీవనశైలి కారణంగా మనిషి జీవితం బుద్బుదప్రాయమైంది. ‘శతమానంభవతి’ అనేది కేవలం నెరవేరని దీవెనగానే మిగిలింది. అయితే, శాస్త్ర-విజ్ఞానం, ఆత్మైస్థెర్యం కలిస్తే మనిషి నిండు నూరేండ్లు కాదు.. అంతకుమించి కూడా బతుకవచ్చని కొత్త అధ్యయనం ఒకటి తేల్చింది. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వంద ఏండ్లు, ఆ పైబడినవాళ్లు (సెంచనేరియన్లు) సుమారు 5,73,000 మంది ఉన్నారు. ఇందులో 97 వేల మంది అమెరికాలో, 79 వేల మంది జపాన్‌లో నివసిస్తున్నారు. ఈ లెక్కన చూసుకుంటే రానున్న కొన్ని దశాబ్దాల్లో మరో రెండుమూడు లక్షల మంది సెంచనేరియన్ల జాబితాలో చేరొచ్చు. వైద్య శాస్త్రంలో కొత్త ఆవిష్కరణలు, ప్రాణాంతక వ్యాధులను లొంగదీసే మెరుగైన చికిత్సలు, ఆరోగ్యంపై పౌరులకు శ్రద్ధ పెరుగడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే.. వచ్చే 80 ఏండ్ల కాలంలో 130 ఏండ్ల వరకు బతికే వారు పెరుగొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. దీని కోసం ‘బయేసియన్‌ స్టాటిస్టిక్స్‌’ పద్ధతిని ఉపయోగించారు. 2100 నాటికి 125-130 ఏండ్ల వరకు కనీసం ఒక్కరైనా జీవించే అవకాశమున్నదని పేర్కొన్నారు. అంతకుమించి కూడా బతుకొచ్చని అభిప్రాయపడ్డారు. గత విశ్లేషణలు, గణాంకాలను బేరీజు వేసుకుంటూ భవిష్యత్తు సంభావ్యతను కనుగొనే పద్ధతినే ‘బయేసియన్‌ స్టాటిస్టిక్స్‌’ అంటారు.మానవ శరీరాకృతి దాదాపు అందరికీ ఒకేలా ఉంటుంది. అయితే ఒలింపిక్స్‌లో పరిగెత్తే క్రీడాకారుడిలా.. ఇంటి పక్కన ఉన్న వ్యక్తిని పరిగెత్తమంటే కుదరదు. చంద్రుడిపై అడుగిడిన వ్యోమగామికి.. సాధారణ ఉద్యోగికి కూడా తేడా ఉంటుంది. పట్టుదలతో శ్రమిస్తేనే ఏదైనా సాధ్యం. జీవించాలన్న తృష్ణ ఉండి, దానికి అవసరమైన ఆరోగ్య నియమాలు పాటిస్తే ఎవరైనా 130 ఏండ్లు ఆపైన జీవించవచ్చు. – మైఖెల్‌ పియర్స్‌, శాస్త్రవేత్త..ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఎక్కువ వయసున్న వ్యక్తిగా జపాన్‌కు చెందిన మహిళ కేన్‌ తనాకా (118) నిలిచారు. జేన్నె కాల్మెంట్‌ అనే మహిళ 1997లో 122 ఏండ్ల వయసులో మరణించారు.మొక్కల వయసును నిరోధించే కొత్త ఎంజైమ్‌ను ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ ఎంజైమ్‌ను డీకోడ్‌ చేసి దాని క్రియలను జీవుల శరీరంలోని కణ విభజనలో కీలకపాత్ర పోషించే టెలోమెరాస్‌ ఎంజైమ్‌కు ఆపాదించి మ్యాపింగ్‌ చేశారు. ఫలితాలు ఆశాజనకంగా ఉన్నట్టు గుర్తించారు. ఈ ప్రయోగాలు మరింత పురోగతి సాధిస్తే మనుషులు అమరత్వాన్ని సాధించడం కష్టంకాకపోవచ్చు. కాగా మనిషి శరీరంలో జరిగే కణ విభజన వృద్ధాప్యానికి ఒక కారణమన్న విషయం తెలిసిందే.
దేశాలు-సగటు ఆయుర్దాయం
జపాన్‌-84.3 ఏండ్లు
ఆస్ట్రేలియా-83 ఏండ్లు
ఫ్రాన్స్‌-82.5 ఏండ్లు
అమెరికా-78.5 ఏండ్లు
భారత్‌-69.42 ఏండ్లు
ప్రపంచం-73.3 ఏండ్లు
2100 నాటికి జీవించే కాలం-అవకాశం
126 ఏండ్లు 89%
128 ఏండ్లు 44%
130 ఏండ్లు 13%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *