పాప బతకాలంటే 16 కోట్ల ఇంజక్షన్ కావాలి

చిరునవ్వులు చిందిస్తున్న ఈ పాప పేరు తీరా కామత్. ఈ ఐదు నెల‌ల పాప ప్రాణం నిల‌బ‌డాలంటే ఒక‌టికాదు రెండు కాదు ఏకంగా రూ.16 కోట్ల ఇంజ‌క్ష‌న్ వేయాలి. అది కూడా నెల రోజుల్లోపే. ఒక‌వేళ ఇంజ‌క్ష‌న్ వేసినా.. ఆ బిడ్డ బ్ర‌తికే చాన్స్ 50-50 మాత్ర‌మే. ఇంత‌టి విషాధంలోనూ ఆ త‌ల్లిదండ్రులు వెనుకాడ‌లేదు. బిడ్డ‌ను ఎలాగైనా బ‌తికించుకోవాలని రూ.16 కోట్లు జ‌మ‌చేశారు. అమెరికా నుంచి ఆ ఇంజ‌క్ష‌న్ తెప్పించి పాప‌కు వేయ‌డ‌మే త‌రువాయి.

తీరా కామ‌త్‌ త‌ల్లిదండ్రులు ప్రియాంక‌, మిహిరా. స్వ‌స్థ‌లం ముంబై. ఆ పాప‌కు వ‌చ్చిన వ్యాధి పేరు స్పైన‌ల్ మ‌స్కుల‌ర్ అట్రోఫీ. దీనిని ఎస్ఎంఏ అంటారు. ఈ వ్యాధి సోకిన‌వారిలో వెన్నెముక కండరాలు క్షీణిస్తాయి. ఆ త‌ర్వాత ఒక్కో అవ‌య‌వం ప‌నిచేయ‌డం మానేస్తుంది. తీరా ప్ర‌స్తుతం ఎస్ఎంఏలో టైప్ 1 స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతోంది. ప్ర‌స్తుతం ముంబైలోని ఎస్సార్సీసీ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతోంది. టైప్ 1 చాలా డేంజర్ అంటున్నారు డాక్టర్లు. మ‌రో నెల రోజులు మాత్ర‌మే బ‌తుకుంద‌ని చెప్తున్నారు.

మ‌న శరీరంలో ప్రోటీన్లను ఉత్పత్తి చేసే జ‌న్యువు ఒక‌టి ఉంటుంది. ఇదే కండరాలు, నరాల‌ను ఉత్ప‌త్తి చేస్తుంది. ఆ జన్యువు తీరా శరీరంలో లేక‌పోవ‌డంతో స‌రిప‌డా ప్రొటీన్లు ఉత్ప‌త్తి కాలేదు. ఫ‌లితంగా ఆ పాప శ‌రీరంలో నరాలు, కండలు జీవం లేకుండా పోయాయి. మెదడు వరకు వెళ్లే నరాలు కూడా సరిగ్గా పనిచేయడం లేదు. ప్ర‌స్తుతం ఆ చిన్నారి ఊపిరితిత్తులలో ఒకటి పని చేయడం మానేసింది. దీంతో వెంటిలేట‌ర్‌పై ఉంచారు. చిన్నారి ఆహారం తీసుకోవడానికి ఇబ్బంది పడుతోంది.

ఈ వ్యాధికి అమెరికాలో మాత్ర‌మే ఇంజ‌క్ష‌న్ ఉంది. దాని పేరు జాల్ గెస్ట్ మా. దాని ఖ‌రీదు అక్ష‌రాలా రూ.16 కోట్లు. ఈ వార్త విని ప్రియాంక‌, మిహిరా షాక్ అయ్యారు .వాళ్ల అదృష్టమో..పాప అదృష్టమో కాని..క్రౌడ్ ఫండింగ్ ద్వారా వారికి నాలుగు నెల‌ల్లోనే రూ.16 కోట్లు స‌మ‌కూరాయి. ఆయుష్మాన్ తీరా పేరుతో సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పంద‌న ల‌భించింది. ప‌లువురు బాలీవుడ్ గాయ‌కులు ప్ర‌త్యేకంగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి డ‌బ్బు పోగేశారు. ప్ర‌స్తుతం ఇంజ‌క్ష‌న్ తెప్పించే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. ఇవేమీ తెలియని తీరా.. హ‌స్పిట‌ల్‌లో చిరున‌వ్వులు చిందిస్తోంది. ఆ చిరునవ్వు క‌ల‌కాలం ఉండాల‌ని మ‌నంద‌రం కోరుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *