30 నిమిషాలకు.. ‘500’ పార్కింగ్ ఛార్జ్.. బాబోయ్ రైల్వే శాఖ..
సాధారణంగా పార్కింగ్ ఛార్జ్ ఎంత ఉంటుంది.. ఒక రోజుకి మహా అయితే 50 రూపాయలు. గట్టిగా లెక్కేసుకున్నా వంద రూపాయల వరకు ఉంటుంది. కానీ కేవలం 30 నిమిషాలు కార్ పార్కింగ్ చేసినందుకు ఏకంగా 500 రూపాయలు చార్జీ వసూలు చేశారు. ఈ మహా దోపిడీ ఎక్కడో కాదు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగింది. ఒక వ్యక్తి ఈ నెల 4వ తేదీన ఉదయం 11 గంటలకు తన కార్ ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్కింగ్ జోన్ లో పార్క్ చేసాడు. తిరిగి 11:32 గంటలకు బయటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే అక్కడున్న పార్కింగ్ ఏజెన్సీ 500 రూపాయలు కట్టాలంటూ బిల్లు చేతిలో పెట్టింది. దీంతో ఆ వ్యక్తి నోరెళ్లబెట్టాడు. ఇదేం దోపిడీ అని ప్రశ్నిస్తే.. అదంతే అని సమాధానం వచ్చింది. చేసేదిలేక ఐదు వందలు కట్టి బయటికి వచ్చాడు. తన ఆవేదనను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. అరగంటకు 20, 30 రూపాయలు వసూలు చేయాల్సింది పోయి పది రెట్లు ఎక్కువ దోచుకుంటారా అని నెటిజన్లు నిలదీస్తున్నారు.