50అడుగుల లోతు బావిలో పడిన మహిళ..తర్వాత ఏం జరిగింది..
వాయనాడ్‌లో ఓ మహిళ ప్రమాదవశాత్తు కాలుజారి 50 అడుగుల లోతు బావిలో పడింది. అయినా ఆమె చనిపోలేదు. ప్రాణాలతో బయటపడి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు చిన్న గాయం కూడా కాకపోవడం విస్తుపోయేలా చేసింది.ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. సాధారణంగా అంత లోతున్న బాడిలో పడితే బతకడం కష్టం అని స్థానికులు అంటున్నారు. ఒకవేళ బతికినా గాయాలైనా కచ్చితంగా కావాల్సిందే అంటున్నారు. అయితే, అందుకు భిన్నంగా ఆ మహిళ విషయంలో జరగడం అందరిని విస్మయానికి గురి చేసింది. మహిళ బావిలో పడటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పాట్ కి వచ్చారు. సహాయక చర్యలు చేపట్టారు. తమ దగ్గర ఉన్న నిచ్చెన లాంటి తాడు సాయంతో అగ్నిమాపక సిబ్బంది బావిలోకి దిగి.. బాధిత మహిళను భారీ వలలోకి ఎక్కించారు. ఆ తర్వాత ఆమెను స్థానికుల సాయంతో పైకి లాగి కాపాడారు. అంత లోతు బావిలో పడినా మహిళ ప్రాణాలతో ఉండటం, చిన్న గాయం కూడా కాకపోవడం గ్రామస్తులనే కాదు పోలీసులను, అగ్నిమాపక సిబ్బందిని సైతం విస్మయానికి గురి చేసింది. బావిలో నుంచి బయటికి వచ్చాక ఆమె ఎంచక్కా తన కాళ్ల మీద నిల్చోవడం మరింత ఆశ్చర్యం కలిగించింది. కాగా, మహిళ రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 50 అడుగుల లోతు బావి నుంచి మహిళను ఎంతో చాకచక్యంగా బయటకు తీసిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బందిని ప్రశంసిస్తున్నారు. వారికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.